పుట:Bharatiyanagarik018597mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(3) కొరియా :- చైనానుండి బౌద్దమతము కొరియాకు - ప్రాకినది. క్రీ. శ. 374లో 'అతో, 'షన్‌తో' అను నిర్వురు భిక్షువులాదేశమునకు రాజధానియగు పినాంగ్‌పట్టణము కేగిరి. మఱి పదిసంవత్సరములకు బిమ్మట మతానందుడను నతడు కొంద ఱనుచరులతోగూడ కొరియారాజ్యమున కాహ్వానింపబడెను. 5వ శతాబ్దమున మఱియొక భిక్షువు కొరియాలోని సిల్లరాజపుత్రికకు దనయోగశక్తిచే చికిత్సజేసి రాజాదరమును బడసి, యారాజ్యమున తాంత్రికబౌద్దమతమును వ్యాపింపజేసెను. మఱి యేబదిసంవత్సరములకు కొరియారాజదంపతులు బౌద్దదీక్షను గైకొనిరి. అంతట నాదేశమునం దొక మతనియోగ మేర్పడి 10వ శతాబ్దమువరకును బౌద్దమత మభివృద్ధినందెను.

(4) జపాన్ :- క్రీ. శ. 5వ శతాబ్దమున చైనా నాగరికత జపానుకు సోకినను బౌద్దమతముమాత్ర మాదేశమునకు కొరియా మూలముననేవచ్చెను. 538 లో కొరియాదేశము స్వర్ణనిర్మితమగు నొక బుద్దవిగ్రహమును కొన్నిబౌద్దగ్రంథములను సామంతతా చిహ్నములుగ చైనాదేశమున కంపెను. మఱి నలుబదిసంవత్సరములకు 'ఉమయోచో' యను జపాన్‌రాజు భౌద్దమతమును రాజమతము నొనర్చెను. కొరియాభిక్షువులచే దన ప్రజలకు వైద్యజ్యోతిషములను చెప్పించి యీతడు దేశీయులను గొందరిని బౌద్దధర్మమును దెలిసి కొనుటకై చైనాదేశమున కంపెను. బౌద్దమతముతోపాటు కళలు, స్వచ్చందసేవ మున్నగునవికూడ జపానును బ్రవేశించినవి. 'కన్‌జిన్‌' అనునాత డీదేశమున వైద్యసంఘములను స్థాపించెను. 736 లో భారతీయుడును, బ్రాహ్మణుడును భారద్వాజగోత్రియుడునగు బోధిసేనుడను భిక్షువు చిత్రకారులను, గాయకులను దోడ్కోని జపానుదేశమునకేగి ముప్పదిసంవత్సరములకాలము బౌద్దమతప్రచారము నొనర్చెను. ఈభిక్షువులు భారతీయాదర్శములను భారతీయ గానమును చిత్రకళను దేశీయులకు నేర్పియు, దేశీయనాగరికత నభివృద్ధిపరచియు