పుట:Bharatiyanagarik018597mbp.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇచ్చటి ప్రజ లూహాశక్తియు, గావ్యధోరణియు గలవారుగ నుండిరి. ఈ గుణములకు భారతీయమగు ఋజువర్తనమును, మనస్సంయమనమును, ధ్యానమును తోడుజేసి, యీభిక్షవు చైనాదేశమున ధ్యానవాదమునకు (School of Meditation) బునాదులేర్పరచెను. క్రీ. శ. 5 వ శతాబ్దిలో కాశ్మీరరాజపుత్రుడగు గుణవర్మయను నాతడు మతదీక్షచే రాజ్యమునువిడచి, యన్యదేశములకేగెను. 424లో నీతడు చైనాదేశోత్తరభాగమున దన యత్యద్భుతభాషాంతరీకరణ శక్తివలనను, చిత్రకళా నైపుణ్యముచేతను మతప్రచారము నత్యుత్తమముగ నొనర్చెను. ఒకవిశేషమేమన నీతడు భిక్షుణీజనములకైగూడ గొన్నివిహారములను గట్టించెను. ఇంతటినుండియు సంఘసేనుడు, గుణవృద్ది మున్నగు ననేకులు సింహళ జావాద్వీపముల మీదుగా భారతభూమినుండి చైనాదేశమున కేగియుండిరి. క్రీ. శ. 6 వ శతాబ్దమున మఱి యిర్వురు భిక్షువులు మతప్రచార మొనర్చిరి. వీరిలో బోదిధర్ముడు ప్రథముడు, అతనికి పిమ్మట బౌద్దతత్వజ్ఞులలో ముఖ్యుడగు వసుబంధకవి జీవితచరిత్రమును వ్రాశిన పరమార్థుడుగూడ సముద్రమార్గముననే చైనాకువచ్చెను. అనంగ, వసుబంధు మున్నగు సర్వాస్థివాదుల గ్రంథములను భాషాంతరీకరించి యీపండితుడు చైనాలో యోగాచారవాదమును బయల్వెడలించెను. క్రీ. శ. 7, 8వ శతాబ్దములలో చైనాదేశము నం దీ భారతీయ నాగరీకతా విజృంభణము పరమావధిని గాంచినది. అప్పుడు హిందూదేశమున కేతెంచి యిట విజ్ఞానామృతమును గ్రహించి స్వదేశమగు చైనాను పునీతంజేసిన హ్యూన్ ష్వాంగు, ఈత్‌సింగు మున్నగువార లీవిషయమై వ్రాసియుండిరి. అ కాలమున భారతీయమగు బ్రతివిషయమును గౌరవనీయముగ నుండెడిది. బౌద్దయుగమున హిందూదేశమున వర్థిల్లిన శిల్పము, విగ్రహనిర్మాణము, తంత్రము, చిత్రలేఖనము మున్నగునవి యాకాలపు చైనాదేశీయుల కాదర్శములై నిరుపమమగు నాగరీకతా సమ్మేళనమును జూపుచున్నవి.