పుట:Bharatiyanagarik018597mbp.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈభారతీయ నాగరికతా విస్తరణముయొక్క యారంభకాలమునుగూడ నొకవిధమున నిర్ణయింపవచ్చును. కెపడోషియా యను దేశమున "బోగజ్‌కోయి" యనుచోట నొకశాసనము గనుగొనబడినది. ఇది క్రీ. పూ. 14 వ శతాబ్దినాటిదని పండితులు నిశ్చయించి యున్నారు. "హిట్టైట్" "మిట్టాని" యను రెండుజాతులవారు నిరంతరమును తమలోజరుగుచుండిన సమరములను మాని, సంధియొనర్చుకొని, దానికి బ్రమాణముగ వేదములలో పేర్కొనబడిన ఇంద్ర, వరుణ, మిత్రాది ప్రాచీనార్యదేవతలను పేర్కొనిన ట్లాశాసనమునుండి తెలియుచున్నది. ఈసంధి చిరస్థాయిగనుండుటకై యీజాతుల రాజవంశములకు వైవాహికసంబంధ మేర్పరుపబడెను. మరియు నప్పుడువివాహితులైన నూతనదంపతుల కభ్యుదయ మొసంగుటకై నా సత్యులను వైదికదేవతలు ప్రార్థింపబడిరి. క్రీ. శ. 13 వ శతాబ్దినాటికి పెక్కుస్థలముల నుపద్రవములు సంభవించి, భారతీయ నాగరికత యంతరించెనవి. యింతకిబూర్వము చెప్పియుంటిమి. కాన నీనాగరికతా విస్తరణము క్రీ. పూ. 14 వ శతాబ్దినుండి క్రీ. శ. 13 వ శతాబ్దివరకును జరిగెనని స్పష్టమగుచున్నది.