పుట:Bhaktirasashatak018555mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షోడశకళాసంపూర్ణుఁడై ధ్వాంతమా
లికలెల్లన్ బరిమార్పుచున్ దిరుగఁడే శ్రీసూర్యనారాయణా! 8

మ. అవనిన్ భూసురవర్యు లవ్విధినిషేధాచారసంసక్తులై
సవనాదిక్రియ లగ్నిహోత్రజపముల్ సంధ్యానమస్కారముల్
శివపూజాదికమున్ ఘటించి నిఖిలక్షేమంబు లర్థించుచున్
శివరూపుండ వటంచు నెంతురు గదా శ్రీసూర్యనారాయణా! 9

మ. భవదుస్రంబులు కాలవేగమున శుంభద్వ్యోమభాగంబునన్
బవనోద్ధూతములై ఘనంబు లగుచున్ బాటిల్లి నిర్ఘాతభై
రవరావంబు లెసంగ భూరిజలధారావృత్తి రక్షింపవే
నృవరు ల్మెచ్చఁగ సస్యపంక్తి నెచటన్ శ్రీసూర్యనారాయణా! 10

శా. లోకాలోకము దాఁటి చండకిరణాలోక్యస్వకాయప్రభా
నీకం బొప్ప ననేకలోకతిమిరోన్మేషంబు వారించి య
స్తోకాసక్తి నశేషజంతుతతి నెంతో బ్రోచు నిన్ జిత్తనా
ళీకాభ్యంతరసీమ నిల్పి కొలుతున్ శ్రీసూర్యనారాయణా! 11

మ. ఖనటత్త్వత్కరదీప్తమూర్తు లగుచున్ గన్పట్టు చంద్రాదులన్
గనుఁగొంచున్ గణకుల్ సుఖార్తిఫలసంధాతల్ గదా యంచు గొ
బ్బున నూహింతురు కూడునే భువనముల్ పుట్టించి రక్షించి త్రుం
చి నటింపంగల కర్త వీవు గలుగన్ శ్రీసూర్యనారాయణా! 12