పుట:Bhaarata arthashaastramu (1958).pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నెత్తిపై వేయుడు" అని యభిమానమున నెదురాడి కష్టమునకుం దగిన ఫలమబ్బిన నదియే శ్రీ వైకుంఠమని ధృతిమై దాల్మిదాల్చును. ఒక్కపనియు జేయజాలక నిరర్థకులుగ నుండువారే "సర్వార్థసిద్ధులు ఏదేవుడైనవచ్చి వర్షించిపోవునా" యని గ్రుక్కిళ్ళు మ్రింగుచు నుండువారు. వీరియాశలకు ఎల్ల లేర్పఱుప బ్రహ్మవిష్ణువుల వలన గాదు. ప్రళయకాలరుద్రు డొకవేళ దలద్రుంచి పర్యాప్తి గలిగింప జాలునేమో! కష్టించినవానికి గూలినిచ్చి సమ్మద మొనగూర్పనగు గాని బిచ్చగానికి సంతుష్టియొనర్ప గుబేరునిచేనైనగాదు. దండుగ పోతులట్లు ఇతరులకు బనిచెప్పువా రెవరైనగలరా? వీరభటులు వీరులుమెచ్చునట్లు రణరంగమున బోరనేర్తురుగాని, యింటిలో గూర్చుండి యొరులతో ధైర్యముగ మాటాడజాలని వారైనను వార్తాపత్రికలలో "వానికి ధైర్యముచాలదు, వీనికి ధైర్యముచాలదు" అని లేఖనులతో శౌర్యము జూపించుచు గాలక్షేపముసేయు పిఱికి పందల మెప్పింప జాలుదురా! కావున నకర్మక మహాత్ముల గాలియైన సోకిన సర్వము నెండిపోవును. కర్మశూరుల సహవాసమే నిశ్శ్రేయసమునకు హేతువు.

రాశి - మమత - తృప్తి

వస్తువులరాశి యధికమైన వానియందలి మమత యధాక్రమంబుగ బెరుగక విలోమవృద్ధిని మాత్రము గాంచును. బండము సమగతిమై విస్తరించిన దనుకొందము. వెన్వెంట మమతయు విస్తరించును గాని యంతవేగముగగాక మందగతిమై వ్యాపించును. అనగా మమత హీనవృద్ధికి విధేయమైనదని భావము[1]

  1. హీనవృద్ధి లక్షణము 10 వ ప్రకరణమున దెలుపబడియున్నది. ఈ సందర్బమున దానిం జదువుటయు మంచిది.