పుట:Bhaarata arthashaastramu (1958).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బనికిరాని వస్తువు ! ఇదెంత బాగుగ నున్నది ! ఇపుడే యిది బంగారమునకన్న గొప్పయని యంటిరి. ఇంతలోనె యది నిష్ప్రయోజనంబని యనెదరె ! ఈ పరస్పర విరుద్ధ పూర్వపక్షము లెట్లునిలుచును ? కావున గాలింగూర్చి చెప్పదగిన దేమనగా చూడుడు !

గాలి మిక్కిలి కొంచెముగానున్న దానియొక్క ప్రయోజన మింతింతయని చెప్పనగునా ? కావున దాని కాద్యుపయుక్తి యవ్యయము. అవాఙ్మానసగోచరము. రాశి యెక్కువ యగుటచే దాని యంత్య ప్రయోజనము తఱుగుచువచ్చెను. రాశి యపారమును గోరికకును దలంపునకు మీరినదగుట దాని యంత్యప్రయోజనము సున్నతో సమము. కావుననే దానియందు మనకు నాదరము. ప్రబంధకవులకు వనితామణుల నడుములవలె శూన్యము. అంత్యప్రయోజనము లేకున్నను సమస్తోపయుక్తి లేదనగాదు. మీదిపటముం జూడుడు. అంత్యోపయుక్తి యెఱుకకు రానియంత సూక్ష్మము. అనగా నేమియు లేదనుటకు మర్యాదమాట ! ఇక బూర్ణోపయుక్తియో మేరలేర్పఱుపరానియంత విస్తృతము కాబట్టి సమష్టి సమేయమైన గౌరవమున్నను విలువలేదు. అగస్త్యుడు సముద్రమును అరచేతిలో జేర్చినట్లు వాయువునంతయు నెవడైన మొత్తముగా సేకరించి మూటగట్టి మూలగూర్చున్నచో నది ప్రాణాధారముగాన వాడడిగినంత యిచ్చికొన ద్వరపడుదుము. స్వచ్ఛందముగ వలసినంత దొరకును గాన దానికి నంత్యప్రయోజనమును విలువయు మృగ్యములయ్యె.