పుట:Bhaarata arthashaastramu (1958).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతము చర్చింపదగినప్రశ్న:- అయిదుగ్రుక్కలు నిండా రెబో, ఐదవగ్రుక్కయొక్క ప్రయోజనము 'ఆ' అనగా ఐదుగ్రుక్కలు గలిగిన రాశియొక్క యంత్యప్రయోజన మనుట. ఇది కడపటి గ్రుక్కయొక్క లాభముందెల్పునా ? మఱి తత్పూర్వపు గ్రుక్కలయు నుపయుక్తతం దెలుపునా ?

ఈ సందియమేల కలుగవలె నందురో చూడుడు. నీళ్ళను అమ్ముట కొకడు పీపాయి పూరించి తెచ్చినాడనుకొందము. ఆనీళ్ళను మన నిదర్శనములోని నాలుకయెండినవాడు వెలకు గొనువాడైన నమ్మువాడు తొలిగ్రుక్కకొకవెల, మఱుదానికి నింతవెల, అని యిట్లు క్రమముగ కృష్ణపక్షక్రయముల విధించబోవునా ? పోడు. కారణమేమి ? ఒకగ్రుక్కకుమించిన రాశిలేకుండిన నతడొక్క రూపాయనైన నొసగి దానింబొంద నుద్యుక్తుండగును. ఏల ? దాహ తాపము నిర్భరముకావున. ఒక్కపీపాయి నీరున్నదిగావున నిపుడట్టి క్షామకాలపు ధరల నాతడేలయిచ్చును ? ఇయ్యడు. చెంబునకు నరణాయిమ్మన్నను బేరమునకు సన్నద్ధుడైన గావచ్చును. ఇట్లు నీరములు తక్కువవెలకు లభించునను దానివలని ప్రయోజనముయొక్క గతులు మాఱునా ? ఏలమాఱవలె ? రూపాయనిచ్చిననేమి ? అరణా యిచ్చిననేమి ? తొలిగ్రుక్కచేగలుగు సుఖము పిపాసా తీవ్రతంబట్టి యుండు గావున నది క్రయములమేరకు భిన్నవృత్తి దాల్పజాలదు. అట్లే తదితరములైన గ్రుక్కలయు సుఖము ధరల ననుగమించి యుండదు. ధరలును (క్రిందజూపబోవు విధమునదప్ప) సుఖముల క్షయవృద్ధుల ననుగమింపవు.

చూడుడు. వెలల విషయములోని విపరీతము ! రాశి కొలది వెలలును మాఱును. కొంచెమేపండిన వెల లెక్కుటయు, పంటలు సమృద్ధములైన వెలలు వ్రాలుటయు దెలిసిన సంగతులే. దీనిని ఫటము వ్రాసిచూపిన బాగుగదా !