పుట:Bhaarata arthashaastramu (1958).pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గలిగి జీవించుటకువలయు నుపకరణముల సమకూర్చుట యత్యావశ్యకము, ధనము, విద్య, పదవి లభించినచో మాలవాడు సయితము ఉత్తమకులజులట్ల తేజోవంతుడగును. శుచిగానుండుమని యూరక బుద్ధిజెప్పిన నేమియు ఫలములేదు. మైలగానుండిన నెవరికేమి నష్టమని యుందురు. అట్లుగాక ప్రియమైన వస్త్రమొకటి యొసంగితిమేని పసిబిడ్డలు సయితము ముఱికితగిలిన నష్టమగును గదాయని బహుజాగ్రత్తగ వర్తించి శుచిగానుందురు. కాబట్టి జడపదార్థములద్వారా కలుగు మేలు వేదవాక్యములచే గలుగదు అనుష్ఠానమునకువలయు నుపకరణములు సమకూర్చుటచే సుగుణసంపత్తి యతిశయిల్లునేగాని సుబోధమాత్రముచే నెన్నటికినిగాదు.

ఈ తత్త్వమును బాగుగ గ్రహించిన వారగుటచే చెంగల్పట్టు జిల్లాలోను మంగళూరుపురంబునను కొందఱు దయాళువులు అధమజాతివారి నుద్ధరింపబూని విస్తారమైన భూమిని సంపాదించి చిన్నచిన్న భాగములుగా విభజించి యొక్కొక్కదాని నొక్కొక్క కుటుంబమునకు నుచితంబుగ నిచ్చుటయేకాక పరామరికలేక వారు వ్యవసాయము చక్కగ జేయుచున్నారా, ఇండ్లు వాకిండ్లు శుభ్రముగ నుంతురా, యని దినదినము స్వయముగ విచారణలుజరిపి, విద్యాభ్యాసార్థము పాఠశాలల స్థాపించియు, కళానైపుణ్యముకొఱకు "కాయకష్ట కర్మశాలా" ప్రతిష్ఠయొనర్చియు, తమకు బుణ్యంబును వారికి నీచత్వవిమోచనంబును సంఘటించుచున్న వారని నిదర్శనముగా జూపుట కెంతయు సంతసంబయ్యెడి !

ఇట్లు శిక్షితులును ప్రేరితులును అయిన పంచములు దినదిన ప్రవర్ధమానులై దేశక్షేమము నభిలషించు వారికి హృదయానందము గలుగజేయునంత శ్రేష్ఠత్వమును వహించుచున్నవారు.

ప్రసంగవశమున జాలదూరము వ్రాయబడియె. అర్థార్జనమునకును దన్మూలమున దేశాభివృద్ధికిని నిదానము సస్పృహత్వమని యీ ప్రకరణము వలన దెలియ దగినది.