పుట:Bhaarata arthashaastramu (1958).pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూడుడు! ట్రస్టులనబడు మహాసంధులు స్పర్ధకు నాటంకము లంటిమి. అనగా దమ్ము నిరాకరించి ప్రవర్తిల్లజూచు వైరుల స్పర్ధకుననుట గూఢము. తమచేతనే ప్రయోగింపబడు స్పర్ధకు తాము అడ్డులు ఒడ్డులు కామి తెల్లంబు. ఈట్రస్టులకన్న నెక్కువ మాత్సర్యముతో బనిసేయు వ్యవహారములు న్నె? మఱియు హిందూదేశములోన నస్పర్ధ తంత్రములు వాలాయముగ నాచారములో నున్నవంటిమి. ఇవిమాత్రము స్పర్ధించుటలేదా? తత్పూర్వపుస్థితుల నంతమొందించనిది వీనికట్టి ప్రాశస్తము వచ్చి యుండదు. మఱి యీకాలమున వీనిపై వైరమెత్తివచ్చు నవనాగరక ప్రచారముల నిరాకరించి యెదిరించి నిలువనిది వానికి నింకను ఉనికి యుండదు. ఇంతేకాదు. ప్రాచీనాచార పద్ధతుల నంగీకరించువారి యందును వానియందు ద్రికరణశుద్ధిగ నమ్మువారికి గౌరవము నాయకత్వము సేకూర్పబడవేని యా యాచారములకు భంగము తప్పదు. అట్లగుట సంఘమున యజమాన్యపదవి నందుటకై స్పర్ధయున్న దనియు, నందు భక్తికొలది జయము కలుగుననియు నేర్పడియె, నిర్మాత్సర్యులమను మనవారును నెత్తనిపులులు. అనుసరించిన నాశీర్వాదము, లేనిచో బహిష్కారము ఇత్యాది యుపాయములు లేనివారుగారు.

కావున స్పర్ధ మొదలంట నశించునని ఆశించుట యుక్తంగాదు. ప్రాణములు వోయినగాని యది మనల వదలదు. ఏలన, అయ్యది యార్థిక తంత్రములలో నొక్కటిగాదు, మఱి సర్వతంత్రములయందును జీవరూపమై యిమిడియుండు మహాశక్తి.

ఏ యార్థికస్థితియందుగాని మూడు విధములైన స్పర్ధలు శాశ్వతములు

1. తనకుం బూర్వమైన స్థితిని స్థానభ్రష్టముం జేయుట.

2. తన్ను నాక్రమింపజూచు ఇతరస్థితుల నిరోధింప జూచుట.

3. తనకుంజేరిన పాత్రములలో దనభావమునకు నెంతయు సరిపోయినవారిని తదితరులకన్న నెక్కువ ఫలముల ప్రసాదించి యుద్ధరించుట.