పుట:Bhaarata arthashaastramu (1958).pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునకు జేరినవానివలె నుండవలయుననుట వారి ముఖ్యోద్యమము. కావున నుత్పత్తి ప్రముఖ సర్వార్థిక క్రియామర్మములన్నియు నొండొరులకు ధారాళముగదెలిపి యవిభక్తముగ నుంచికొందరు. ఉత్పత్తిశాలలు విక్రయశాలలును పొత్తుగలిగి యుండుచోట్ల వానికి వచ్చులాభము, అట్లు పొత్తులేక స్పర్ధ మైబనిచేసినవానికి రాదుగాన, నాసంఘములకుంజేరిన యుత్పాదకులకును వర్తకులకును గాఢమైన కూటమి పట్టువడియున్నది. మఱియు నత్యంత విస్తారవ్యాపారోపేతములైన వినిమయశాలలు, సరకుల ఖండితములుగ దమకు దక్కుటకై వ్యవసాయము, వస్తురచన ఇత్యాద్యుత్పత్తి ప్రయత్నముల దామే ప్రారంభించుటయుం జూచియున్నారము. సహవర్గములతో సంధివలదని ప్రత్యేకముగ నిలిచిన సంఘము లనేకములు బీడువడినయవి. దీనింబట్టి చూడగా బరస్పరతా ధర్మమున వర్గసంయోగమను ధర్మము లీనమై యున్నదని తోపకపోవునా? అట్లగుట దేశమెల్ల, మైత్రితో జేయబడు వ్యాపారమున బారీణమైనం గాని యన్యోన్యతాపద్ధతి సంపూర్ణత వహింపదు. కావుననేకదా సంఘ సంస్కారములుగోరు మహాత్ములు, ఈ పద్ధతియే సర్వదోషపరిహారిణియనియు సర్వసుఖప్రదాయినియనియు ఘోషించుచుండుట. ఇంక నే యార్ధిక పద్ధతియందును దీనియందుబలె క్లేశములకోర్చి పరోపకారబుద్ధితో బాటుపడువారు, అంత తఱుచుగ లేరు. అనేకుల కిదియే యొకమతము! యావజ్జీవము దీనిని వ్యాప్తికి దెచ్చుటలోగడపి యదియే మహానందమని యుండువారిసంఖ్య యనల్పము!

స్పర్ధను నిరోధింపజూచుట యననేమి?

ఒకవిధమున జూడబోయిన స్పర్ధను నిగ్రహించుట యప్రకృతమైన యత్నము. ఎట్లన, స్పర్ధను నిగ్రహించుటకు నా స్పర్ధతో స్పర్ధించుట యావశ్యకముగదా? అట్లగుట స్పర్ధ యేరీతిని నిర్మూలమగును? "స్పర్ధ నిత్యము. సర్వవికారముల నంతర్యామియైన తత్త్వము" అనుటయు సత్యమ.