పుట:Bhaarata arthashaastramu (1958).pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడుకకాండ్రకును బంచిచ్చి, సేవకులకు కూలితప్ప మఱేమియు నీయని యపక్వపద్ధతి నవలంభించిన వ్యావహారికసమాజములు. ఈసమాజముల జేరినవారిలో ముక్కాలు మువ్వీసముమంది శ్రమకరు లయ్యును వారును దమసేవకుల దక్కువగాజూచుచు, తాము తమ యజమానులనుండి పడయగోరిన హక్కులను దమకు నధీనులైనవారికి నియ్యక యుండుటంజూడగా, మనుష్యులయొక్క సహజకాఠిన్యము గోచరింపకపోదు. అయిన నొక్కటి. ఇప్పుడు పది పండ్రెండేడులుగా స్థాపనకువచ్చు సమాజములలో కూలివారికిని లాభభాగాదు లేర్పడి యుండుటవలన భావిని పరస్పరత సర్వవ్యాపినియై యుండునేమో యను కుతూహలము గలిగెడును. సమగ్రమైన యన్యోన్యతంబూనిన సంఘములలోని శ్రమకరులసంఖ్య ప్రకృతము సుమారు 6000. ఈ సంఘములవలని మేలులలో ముఖ్యము లెయ్యవియన:- 1. శ్రమకరుల యభివృద్ధి. 2. కర్తలకును గర్మకరులకును గలహములు లేకపోవుట. 3. శ్రమకరులకు విద్యజెప్పించుట, పించెనులిచ్చుట మొదలైన యుదారక్రియలకునై ద్రవ్యసంచయముల ప్రోగుచేసి వినియోగించుట ఇత్యాదులు.

కో ఆపరేషన్‌వలన జనసంఘమునకుగల్గు శ్రేయస్సులు

1899 వ సంవత్సరములో నింగ్లాండులోని కో ఆపరేటివ్ సంఘములచే విద్యావిషయముగా జేయబడిన ఖర్చు సుమారు 24,000 సవరనులు. అనగా 3,60,000 రూపాయనుట! పాఠశాలల స్థాపించుట, పండితులచే బ్రసంగములు సేయించుట, పుస్తకభాండాగారములం బ్రతిష్ఠించుట ఇత్యాది సాధనములచే జనసామాన్యముయొక్క హృదయమునకు నుల్లాసము నుత్సాహముందెత్తురు. మఱియు బుద్ధికశలత గలవారయ్యు దారిద్ర్యమువలన ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాశాలలలో జదువనేరని బాలురకు సహాయముగా సంవత్సరమునకు రు. 3000 ఆదాయముగల విద్యార్థివేతనకోశముల రెంటిని