పుట:Bhaarata arthashaastramu (1958).pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరస్పర సమాజములలో మొత్తపులాభమును సామాజకులకు బంచియిచ్చుటయేగాక ప్రతి సామాజకుడును తమయంగడిలో గొను సరకుల వెలల పరిమాణమును ననుసరించి వానికి తఱుగుడు నిత్తురు. అనగా 100 రూపాయల వస్తువులు గొన్నవారికి 10 రూపాయలు, ఇట్లు నియమముల ననుసరించి త్రోపుడుచేయుట. ఇట్టి సహాయములచే సామాజికులు తమయొద్దనే తీయునట్లుచేయ జూచుటయుంగలదు. ఈ త్రోపుడు తమ సమాజమునకుంజేరని వాడుకకాండ్ర కియ్యరు.

ఈ యంగళ్ళకే యింగ్లీషులో 'కో ఆపరేటివ్ స్టోర్స్‌' అని పేరు. ఇవి విక్రయశాలలుగాన - అనగా వస్తువులను వాడుకకాండ్రకు బంచియిచ్చునవియనుట - వీనిని స్థాపించు సమాజములకు విభజన సమాజములనియుం బేరుగలదు. ఈశాలలువలన కర్మకరులకు గలుగు ఫలములు:-

1. కూడబెట్టిన ధనమును వడ్డీవచ్చునట్లు నిక్షేపించుట కివి యనుకూలములు.

2. వస్తువులగొనుట మొదలైన విధముల వచ్చులాభము చిల్లరచిల్లరగావచ్చిన నప్పుడప్పుడే సెలవైపోవును. అట్లుగాక సంవత్సరమున కొకటి రెండు తడవలుగ మొత్తముగా జేతికినందిన నీలాభమును వ్యర్థముగాజేయక లాభకరములైన యుద్యమములలో మూలధనముగ బ్రయోగింతురు.

ఈ రెండు గుణమ్ములుండిన మాత్రముననే వీని నన్యోన్య సమాజములని చెప్పశక్యముగాదు. పరస్పరత నిక్కంబగుటకు నాధారములు రెండు. సేవకులకు లాభములో పాలిచ్చుట, లేక భాగస్థులు గాకున్నను యజమాన మండలిలో జేర్చుకొనుటయును, వాడుకకాండ్రకు అనగా వినియోజకులకు దాము గొను వస్తువులయొక్క ధరల పరిమాణముంబట్టి తఱుగుడు మొదలగు విధముల లాభ మొన గూర్చుట యును. ఈ లక్షణములులేకున్న శ్రమకరులకు బీదలకు నెంత