పుట:Bhaarata arthashaastramu (1958).pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొప్ప వ్యవహారముల నడుపుటకు నాధారములు రెండు. మూలధనము, బుద్ధిబలము. ఈ కాలమున బీదలు సైతము కుశలతయు, యోగ్యతయు గలవారుగానున్న మూలధనము సేకరించుట దుర్ఘటము గాదు. ఎట్లన, అనేకులుగలసి తమకు గలిగినది కొంచెమో యధికమో వేసికొనిన "ఓల్‌డ్‌హేమ్" అను నింగ్లాండులోని యొకానొక పట్టణమునందలి శిల్పులమాడ్కి తామే ఘనమైన శాలల బ్రతిష్ఠింప జాలుదురు. బ్యాంకీలు, నిధులు మొదలగు ధనాగారములలో నెంతో రొక్కము వ్యర్థముగాబడి కుళ్ళుచున్నదిగాన తగిన వ్యావహారికులు వచ్చిరేని నయమైనవడ్డీతో ఋణమిచ్చుటకు నెందఱో కాచుకొనియున్నారు. మఱియు, తాను బీదవాడుగావున తనకెవ్వరు నప్పునియ్యరనుశంకగొనిన నది సహజమేకాని, యనేకులు బీదలైన కర్మకరులు సంఘములుగానేర్పడి సమూహముగ "మేమెల్లరము నుత్తరవాదులము" అని నమ్మికజెప్పి యర్థించిన నట్టిసంఘములకు మితవృద్ధిగోరి ధనమునొసంగ నెవరును వెన్కదీయరు. ఇండియా దేశములో 'కో ఆపరేటివ్ క్రెడిట్‌' సంఘములు (అనగా బరస్పర ముత్తరవాదులుగా నుండవలయునను నియమముతో ననేకులు గలసి ఋణప్రసాధనమునకై యేర్పఱ చిన సంఘములు) సంఖ్యలో నానాటికిం బెఱుగుచున్నవి. కారణమేమి? కలసి యర్థించిరేని మోసము నకు నవకాశము తక్కువ, దివాలెత్తుదురను భయముతక్కువ, కావున వడ్డీ తక్కువ. ఇచ్చుసొమ్ము ఎక్క్కువ. కావున నన్యోన్యతమై సమాజములుగ నేర్పడిన బీదలు సయితము కావలసినంత మూల ధనము లేపగలరు. విశ్వాసము, విమర్శ, ఉత్సాహము మొదలైన యుత్తమ వ్యవహార సంప్ర దాయము లఖండముగనుండు ఇంగ్లాండు మొదలగు పశ్చిమదేశములలో మూలధనమను పంటకు క్షామములేదు. మఱియెన్నడునురాదు. మూలధనము గడించుట దుస్తరము గాదు. కావున శ్రకరులకుండు ముఖ్యమైన లోపము పరిపణమనుట తప్పు. మఱి