పుట:Bhaarata arthashaastramu (1958).pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. భావిని దీనింజెందబోవు మహాభ్యుదయమునకు సూచనమో యనునట్లు కొన్ని వ్యవహారముల నిప్పటికే యన్యోన్యత ప్రబలమై వచ్చుచున్నది. ఈ వ్యవహారముల చారిత్రము శీఘ్రముననే వివరించెదము.

మీద జెప్పిన విషయములన్నియు సర్వ సంపూర్ణమైన పరస్పరతా వర్గముయొక్క ధర్మములు. ఇట్టి వర్గములు తఱుచు గానరావు. కాని, యీ ముఖ్యాంశములయందు గొన్నింటిమాత్రము స్వీకరించిన యసమగ్రపద్ధతు లనేకములు గలవు. అపరిపూర్ణములైన యన్యోన్యతా విధానములలో ముఖ్యము లెయ్యవియనిన;

1. లాభభాగము:- కర్మశాలాధిపతులు తమశిల్పులకు వేతనము లిచ్చుటగాక వచ్చిన లాభమునం దొకానొకవంతు పంచిపెట్టుట. ఇంతేకాని సేవకమండలి నెట్టి యధికారమును స్వామ్యమును మృగ్యములు.

ఈరీతివలని ఫలంబులు:- కారయిత కర్మకరు లిరువురును లాభాధిక్యమందాసక్తి గలవారగుదురు గావున వారలలో గలహము లంతగాబుట్టవు. శిల్పులును మనసుంచి కష్టింతురు. మఱియు నిట్టి శాలలో స్థానము లలవడిన మేలుగదాయని నిపుణులైన పనివారు వచ్చి చేరుదురుగాన కార్యములు నిండుఫలము నొసంగును.

2. నష్టభాగము:- కొన్నియావేశనములలో శిల్పులకు లాభం నందొక భాగమిచ్చి నష్టమువచ్చెనేని వారును నొకవంతు భరించు నట్టుచేతురు. ఇయ్యది పనివారికి సమ్మతమైన తెఱంగుగాదు. తమకు యజమానత్వము లేమింజేసియు, నష్టము కొన్నిసమయముల నకస్మాత్తుగ దటస్థించు కారణమ్ముల వలననేగాక యజమానుల బుద్ధిహీనతవలనను వచ్చుట ప్రసిద్ధముగావునను శ్రమకరులు నష్టమునకుం బాత్రులౌట కొడంజడమి సహజము. అట్లు నష్టమును భరింపవలయునయేని కార్యమును భరించుటలో తమకు హక్కునియ్యవలయునని వారివాదము.