పుట:Bhaarata arthashaastramu (1958).pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. బయటిదేశములనుండి చక్కెర యనర్గళముగా దిగుమతి యయ్యెనేని వెలలు తగ్గునను భయముచే నట్టి సరకులమీద గొప్ప సుంకముల విధించుటకును, విధించిన వాని దీసివేయక వుంచుటకునునై రాజ్యాంగమువారికింగూడ గోట్లకొలది లంచము లియ్య సన్నద్ధులైరి. ప్రభువులు, మంత్రులును, నైచ్యమునకు లోబడనివారైనను దక్కువ యుద్యోగస్థు లందఱుజెడిన న్యాయమైన దొరతనము నడచుటెట్లు?

ఈ సంధిసంఘమ్ముల వృత్తంబులేమనవచ్చు? 'ధనమూల మిదం జగ' త్తను న్యాయమును సార్థకము చేయంబొడమిన యవతారములో యనునట్లు బేహారులు స్వలాభంబుమాత్రమాసించి ధర్మాధర్మముల గమనింపక దుశ్చర్యలకుం బూనిరి. చూడుడు! ఏకేశ్వరత్వము నిర్భయతం బుట్టించును, నిర్భయత దుర్మార్గావలంబ నమునకు నెత్తిన కారణముగదా!

1882 వ సంవత్సరమున రాకిపెల్లరు కిరోసిన్ వ్యాపారముల యందు దనచేయిక్రిందైన సంధినొండు గల్పించి యీ సంశ్లేషపద్ధతికి ద్రోవసూపెను. తరువాత శర్కరా వ్యాపార సంధియట్టులు సంధిసంఘము లనేకము లావిర్భవించెను. అందుముఖ్యములు:- మాంసము, ఉక్కు, ఇనుము, విస్కీ యను నొకవిధమైన మత్తునిచ్చెడు ద్రవము వీనికిం జేరినవి. ఇట్టు లింకను ననేక వస్తువుల వ్యాపారమంతయు నీడుతోడులేక యనివార్యము గానేలు ధర్మసంధుల పాలయ్యెను. ఈసంధుల చర్యలన్నియు సజాతీయములౌటచే బ్రజకేగాదు రాజ్యాంగమువారికిని నీసును రోసమునుబట్టి ఇవి ఇతరములను బంధించి నట్లు వీనిని బంధింపవలయునని శాసన పాశమ్ముల నల్లనారంభించిరి. ఈ శాసనము లెవ్వియన:-

రాజ్యాంగమువారు ధర్మసంధుల బంధింపజూచుట

1. ధర్మకర్తలపరముగా భాగస్థులు తమ హక్కుల నిచ్చుటయను బూటకము చెల్లదనుట.