పుట:Bhaarata arthashaastramu (1958).pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మితోత్సాహంబునంజేసి 103 లక్షల సవరనులు మూలధనముగాగల 7 వర్తకసమాజములు సృష్టికి వచ్చినవి! ప్రజలు లాభాపేక్షచే 'నేముందు నేముంద' ని ధనమును వర్షముగా గురిపించిరి. కంపెనీల భాగములవెలలు పెఱిగినవి పెఱిగినవే! ఒక్కనెలలోన 100 సవరనులు గానుండిన భాగములు 150 సవరనుల కెక్కినవి!! ఇట్టి ధీరవ్యాపార మెన్నాళ్ళు నిలువగలదు? ఉన్నట్టుండి తమసాహసమే తమకు భయముగలిగింపగా నందఱు నిక వెలలు వ్రాలునేమో యను భీతిచే గొన్నభాగముల విక్రయించుటకు గుంపులుగట్టి వచ్చి నందున, సహజముగనే క్రిందికిదిగుట కుపక్రమించిన వెలలింకను శీఘ్రముగ గ్రిందు వడినందున, నసంఖ్యప్రజకు సేగివాటిల్లి దారిద్ర్యదేవత చుట్టుముట్టెను. 19 వ శతాబ్దము లోని యితర క్షోభల చరిత్రములు వినిమయ కాండాంతర్గతంబులని భావించునది.

క్షోభల సామాన్యలక్షణములు

మూలధనము విశేషించి యెదిగినదగుట, అందుచే ఋణ వ్యాపారములు పెఱుగుట, ధనము సుగమమగుటంజేసి దుర్గమ స్థలంబులసైతము వ్యవహారచక్రముతిరుగుట. అనగా నిశ్చయములేని కళలు వృద్ధివడయుట, దానిచే నాణెమునశించుట, రొక్కముగా నిప్పుడే తమయప్పుల నియ్యవలసిన దని యుత్తమర్ణులు ప్రతిజ్ఞతో బైనబడుట, దానంజేసి సరకులను వ్యవహార సంఘములలోని భాగములను వచ్చినవెలల కమ్ముదమని యందఱు నేకకాలమున సన్నద్ధులౌట, వెల లధోగతిం జెందుట, నష్టమువచ్చి ప్రజలు వ్యవహారులును వానితోన నరకప్రాప్తి ననుభవించుట. క్షోభలయొక్క యంశముల యను క్రమమిట్టిది. మఱియు గ్రిందబడి గాయములు గొన్నవారైనపిదప నమ్మకములేని వారగుట, ఋణములు సుకరముగ నియ్యమి వడ్డి హెచ్చుట, అందుచే జాగ్రత్తతో భద్రములని యేర్పడిన క్రియలమాత్ర మనుష్ఠించుట, తత్కారణమ్మున లాభములు తఱుచగుట;