పుట:Bhaarata arthashaastramu (1958).pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకవిధమైన శిల్పము నభ్యసించు వారెల్లరు నొక సమూహముగ నుండుటంజేసి పారంపర్య ప్రభావంబున వారిసంతతికిని, అందలి కుశలత సులభముగ నలవడును. చిన్ననాటి నుండియు నొక్కకళకు చేరిన మాటలవినుచు జర్యలజూచుచు నదేచింతగా నుందురుగాన బ్రావీణ్యము తమకుం దెలియక తమ్మా వేశించును.

ప్రత్తివ్యాపార మేకస్థలగతంబైనదానిచే విసర్జింపబడిన గింజలన్నియు గొప్పరాసులుగా లభ్యములౌటచే గింజలనుండి నూనె దీయుట. గానుగపిండి తయారుచేయుట యను నుపకళలకు గావలసినంత సామగ్రులు గల్గును. ముఖ్యకళలకు ననుబంధములైన కళల కుపకళలనిపేరు. ప్రత్తియంత్రశాలలు దిక్కున కొకటిగానున్న బ్రతియంత్రమునుండియు రాల్పబడుగింజ లల్పములౌట బ్రత్యేక వృత్తికిం జాలకపోవును స్థానైక్య ముపకళలకుం బ్రకాశకము. ఉపకళలు రెండు విధములు. 1. ముఖ్యకళలందు వర్జింపబడు వస్తువుల రచనకు దెచ్చునవి. 2. ముఖ్యకళలకును నుపకళలకును నావశ్యకములైన పరికరముల మరామత్తు చేయునవి. పది యంత్రశాల లొకటిగానున్న వానిలో వాడబడు చీలలు గొట్టములు మొదలగునవి కల్పించుటకు వేఱొకశాలయేర్పడ వీలుండును. శాలలు దూరస్థములైన నొకొక్క దానికి గొన్ని సాధనములుమాత్రమే సేకురినం జాలుంగాన నీకొంచెపాటి క్రియకు బ్రత్యేక శాలలు స్థాపనకురావు. సంస్కార క్రియలయందు నట్లే. బహుశాలా సంభరిత ప్రదేశముల సంస్కార శాలలకు దరుణముండును. తదితరస్థానముల వారివారి సంస్కారములను వారే చిల్లరచిల్లరగా జేసికొనుట యగత్యము. ముఖ్యకళలలోని యావేశనములు చిన్నవిగనున్నను వానికెల్ల సామాన్యములైన యుపకళాశాలలు పెద్దవిగ నుండకమానవు. ఇట్లు విస్తార వ్యవహారధురీణములైన యంత్రరాజముల నిర్మించి పనిజేయుట లాభకార్యంబగును. విస్తరతకొలది యంత్రములకు నింపు సొంపు నుండుననుట సుప్రసిద్ధము.