పుట:Bhaarata arthashaastramu (1958).pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టకు జనసమూహమ్ము లేతెంచునుగాన. ఇప్పటికిని వీనిప్రాముఖ్యము మొదలంట బోయినదిగాదు. కలకత్తానుండి డిల్లీకి గవర్నమెంటువారు వలసపోవలయునని చక్రవర్తిగా రాజ్ఞాపించినందున కలకత్తాలోని వర్తకులు తమయభ్యుదయమునకు విఘ్నము గల్పింప బడెనని యాక్రోశించుచున్నారు. హిందూ దేశములో పుణ్యక్షేత్రముల కుండునంత గౌరవ మితరరాజ్యములలో గానరాదు. కావుననే తిరుపతి, శ్రీరంగం, రామేశ్వరము మొదలగు పరమపవిత్ర పట్టణమ్ములు పూజాద్రవ్యములైన టెంకాయలు, పువ్వులు, అరటిపండ్లు, కర్పూరము, తిరుమణి, తిరుచూర్ణము, నూనె, నేయి మొదలగువానితో నింపబడి యుండుట. యాత్రాస్థలములన్నియు ముక్తికేగాక భుక్తికిని ననువైన సంతలు. కాల క్రమమున నీపాడుకలిమాహాత్మ్యంబు వర్ధిల్లుటంజేసి దేవతల యొక్కయు రాజ్యాంగము వారియొక్కయు ముఖ్యపట్టణ ములకు ననుగ్రహశక్తియు సంగ్రహశక్తియు లాఘవంబు నొందుచున్నవి.

ప్రకృతి గుణంబు లనుగుణంబులయ్యు పౌరుషంబు సాలదేని నుపయోగమునకురావు నదులు గనులు నెన్నియున్ననేమి? ఆవిరి యెంతయబ్బిననేమి? వానియం దంతర్భవించుయుండు ప్రయోజనంబు లెఱింగి యుచితవృత్తుల నధీనములంజేయు ప్రయత్నము నేరనివాని కవి యుండియు లేనట్టే. నిరుత్సాహ రాజ్యంబుల నదులచే సముద్రమును, ఆవిరిచే నాకాశమును బుష్కలత్వంబుం జెందుగాని ప్రజకుం బ్రతిపత్తి సంకలితంబుగాదు. కావున నెన్నిభంగుల జూచినను, అర్థానర్థములకు మనుష్యులే యుత్తరవాదులు.

స్థానసాంగత్యమువలని గుణము లెవ్వియనిన

యంత్రములయు తదితర రచనాసాధనములయు మేలుకీడులు సమీపస్థులైన యనేకులు పరీక్షింతురు గాన ద్వరలో గనుగొననగును. అట్ల గనుగొన్న విశేషములన్నియు నియ్యైవృత్తుల వారికెల్ల బోధపడుట సుగమము.