పుట:Bhaarata arthashaastramu (1958).pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. రేవులు. ఎగుమతి దిగుమతి వ్యాపారమునకు రేవులు ముఖ్యములు. మంచి రేవు లన్నియు స్వతస్సిద్ధములు. బొంబాయి, కలకత్తా, రంగూను మొదలైన స్థలముల యభివృద్ధికి వాని యునికిపట్టు ప్రబల సహాయకారి. మఱియు రేవులుండు స్థలములకు వస్తువుల దెచ్చుటకును, అచ్చటనుండి వాని గొనిపోవుటకును, ఆస్థానములతో గూడిక గలవిగా రైలుమార్గములు వేయబడును. శ్రేష్ఠములైన రేవులు వర్తకము నాకర్షించుటలో నఖండప్రభావములు.

3. గనులు. ముఖ్యముగా, ఇనుము, బొగ్గు, వీనికి బుట్టినిండ్లగు గనులు. యంత్రరచనాది కళలెల్ల వీనివద్ద బ్రదుకునవి.

4. నీటిశక్తి. యంత్రములంద్రిప్పి పనిచేయించుకొనుటకు శక్తి యావశ్యకము. మనుష్యుల బాహుబలము మహాయంత్రములకుం జాలదు. పూర్వము ప్రవాహధారలచే జక్రముల దిరుగునట్లుచేసి తద్ద్వారా యంత్రముల నడుపుచుండుట పశ్చిమదేశములలో సర్వ సాధారణముగ నుండినందున ననేక వ్యాపారములు నదులయొడ్డున స్థాపనకువచ్చినవి. వర్తమానమున విద్యుచ్ఛక్తి నుత్పాదించు క్రియ మొదలగు కొన్ని కార్యములకుందప్ప ప్రవాహముల నంతగా సేవింప వలసిన విధిలేదు ఏలన, నీటిశక్తికిమాఱుగ నావిరిశక్తి నుపయోగించు చున్నాము. ఆవిరికి నీళ్ళుదొరకినంజాలును. వేగవంతము లైన ప్రవాహము లక్కఱలేదు. మఱియు విద్యుచ్ఛక్తియు యంత్రగమనమునకు నాధారము. అద్దానిని తంతులగుండ మనోవేగమున నెంతదూరమైన దీసికొని సులభముగ పోవచ్చునుగాన నదులు, ఆకాశ గంగలు, వీనియొద్ద నాశక్తిని గలిగించి వలసినచోటుల వినియోగింతురు. కావున కళలు గుమిగూడక చెదరియుండుటకు నీశక్తి ద్వితీయము, నిదానము.

5. పూర్వకాలమున పుణ్యక్షేత్రములు, రాజనివాస స్థానములు వర్తకమునకు శరణ్యములై యుండినవి. ఏలనగా వీనినాశ్రయించు