పుట:Bhaarata arthashaastramu (1958).pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేరునట్లు చేతురు. గొప్పవారు ప్రచురించు ప్రకటనలంజూచి "వీరు తప్పుద్రోవల బోదురా? తెలిసినవారు గదా, వీరియాశ్రయ మెన్నటికిని గీడుగాదు" అనియు "ఎందఱో తమ ధనము వేయుచున్నారు వారికైనగతి మనకు. సాహసము చేయనిది జయము గలుగదు. తప్పక లాభము వచ్చునని నిర్ణ యించుట యసాధ్యము. అయిననేమి? తెంపు చేయనిది కార్యారంభము గలుగునా? ఒకచేయి చూతము" అనియు దలపోసి జను లనేకులు పాళ్ళగొందురు.

5. సంకలిత మూలధన సమాజములు నాణెమాధారముగ నిలుచునవి. చోదకులు దుర్మార్గు లైనచో జనుల వంచించుట దుష్కరముగాదు. అనేకు లాషాడభూతులై ప్రజల బేలుపుచ్చి సాహుకారులగుట యుగలదు. ఇందునకు నిదర్శనమైన చరిత్రాంశ మొండున్నదది వినుడు!

ఎనిమిదేండ్లక్రిందట నే నింగ్ళాండులో నుండినప్పుడు 'విటకర్ రైట్‌' అనునొకని యార్థిక మాయలు బహిరంగపఱుపబడెను. ఇవి కృష్ణమాయలట్లు, ఆశ్చర్యజనకములు, రైట్టు బహుచాతుర్యవంతుడు. తొలుత కొన్ని సత్సమాజములనుస్థాపించి కార్యములం జక్కగా దీర్చినవాడై, ఇంకను నౌన్నత్యముం జెందవలయునను నుత్సాహముతో ననేక సమాజములం బ్రతిష్టించెను. ఇందు గొన్ని నష్టము దెచ్చినవి. ఇంకేమి చేయవచ్చునని క్రొత్తక్రొత్త కంపెనీల లేవదీసి వీనిభాగముల నమ్ముటచే వచ్చిన ధనమును ప్రాతవాని కప్పిచ్చునట్లు వ్రాసి యా భాగస్థుల కప్పుడొకరీతి సమాధానముంజూపి, యిట్లనేక విచిత్ర గతులకుం దొడంగినవాడాయెను. కంపెనీలు వెవ్వేఱు పేరుదాల్చి భిన్నములని బయటివారికి దోచినను నిజము చూడబోయిన నన్నిటికి నాధుడువీడె. ఒకకంపెనీపేరదీసి యింకొక కంపెనీకి ఋణ మిచ్చుట యనగా దనకుదానే యప్పిచ్చుకొన్నట్లు! ఈ యప్పులు దీఱునవి యేనా యోచింపుడు! భాగస్థుల యేడుపెట్లున్న నేమి? తాను