పుట:Bhaarata arthashaastramu (1958).pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాలవు. ద్రవ్యరూపమైన మూలధనము చరము. యాత్రలజేయుటలో మనదేశములోని యవ్వలకన్న నెక్కువ సమర్థము. పాదరసమువోలె చంచలంబుగనుంటచే దీనికి "ద్రవమూలధనము" అనియు గీర్తి గలదు. ఇంతేకాదు. ద్రవ్యమును వలసినట్లు పంచి పెట్టవచ్చును. నూరు, ఇన్నూరు, మున్నూరు, వేయి, ఇత్యాదిగ రూపాయల నిచ్చకొలది విభజించి దిక్కుదిక్కులకుం బంపవచ్చును. కర్మకరులనుగాని ప్రకృతిని గాని ఇంత సులభముగ విభజింపలేము. ఈ కారణములచే తొలుదొల్త సంశ్లేషమార్గమును ద్రొక్కినది మూలధనము.

భాగస్థ సమాజములు (అనగా జాయింట్ స్టాక్ కంపెనీలు) పుంఖానుపుంఖములుగ వెడలుటకు హేతువు మూలధనముయొక్క స్వభావము. ఒకకంపెనీలో శక్తిని, ఇచ్చను ననుసరించి నూఱురూపా యలో, లక్షరూపాయలో, మఱి యెంతమాత్రము, అప్రాయము లేని వినియోగమని భావింతుమో యంతమాత్రము పాలుగొనవచ్చును గాన నియ్యది యనేకులకు సాధ్యమైనకృతి.

సంకలిత మూలధన సమాజముల నిర్మాణముం బూర్వమే తెలిపితిమి. దానియంగములు సాధారణ ముగ నాలుగు. నిర్మాత, చోదకమండలి, కార్యదర్శులు, శిల్పులు. నిర్మాత చోదకమండలిలో జేరినవాడైనను నుపద్రష్టవంటివాడగుట ప్రత్యేకముగ గ్రహింపదగినవాడు.

సంభూయ సముత్థానములయొక్క గుణములు

1. చిల్లర చిల్లరగ భాగములుగొని యనేకులు చేరవచ్చునుగాన నెంతద్రవ్యమైనను బ్రోగుచేయవచ్చును. నష్టమువచ్చిన ప్రతి సమాజకునకును బోవునది కొంచమే. నిండుమున్కలు తటస్థించునను భయము లేదు. అయిన నిందొకకీడుగలదు. ఎక్కువనష్టము రాదుగదా యను తెగువచే నుదాసీనులై భాగస్థులు కార్యవిచారణమునం దనాదరబుద్ధిదాల్తురు. అందుచే బేరునకు దామును యజమానులుగా