పుట:Bhaarata arthashaastramu (1958).pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధిక ప్రకరణము

న్యాయశబ్ద నిర్వచనము

న్యాయంబనుపదము నానార్థములు గలది గావున సంధిగ్ధదోషంబుచే బాధితంబు. ఈయర్థముల గణ్యములు మూడు.

1. ప్రకృతి స్వభావము. 2. శాసనము. 3. నీతిసమ్మతము. అనునవి. దృష్టాంతములు.

1. ప్రకృతి స్వభావమునకు, ఉదా. హీనవృద్ధి న్యాయము. ఎట్లన, ఏకమాత్రశ్రమ మూలధనంబు లకు భూమ్యాదుల యుత్పత్తి సాగను సాగను ఫలము తఱుగుచు వచ్చుననుట స్వభావలక్షణము. దీనింగూర్చి ఇది నీతియగునా, కాదా, ధర్మమా? అధర్మమా? యని ప్రశ్నించుట యసంభావ్యము. మనుష్యులచే విధింపబడనిదికావున మనుష్య యత్నముచే నద్దానిని రద్దు చేయుటకుగాదు. దాని బలమును నితర ప్రకృతుల సహాయముచే నాపవచ్చుననుట నిజమేయైనను దానిని లయింప జేయుట మనకసాధ్యమైనవని. ప్రకృతిన్యాయము లన్నియు నీతరగతికిం జేరినవి.

2. శాసనము.అనగా రాజ్యాంగ శాసనమనుట. పన్నులుగట్టుట న్యాయమా యని యడుగుదురేని నుత్తరమెట్లు? అది సహజగుణంబులలో నొకటిగాదు. మనకు కల్పాది నుండి వెన్నంటివచ్చిన కర్మముగాదు. మఱి పరిపాలకులు విధించినందున న్యాయమై వెలయుకార్యం.

రాజ్యాంగ న్యాయములకు ప్రకృతి న్యాయములకును భేదమేమి? జైల్‌ఖానా జుల్మానా, ఇత్యాదులు రాజశాసనమునకుం బోషకములు. అనగా రాజ్యాంగ న్యాయములకు దండనీతి యూతకోల. ప్రకృతి న్యాయములకు మనుష్యుల కృపలు కత్తులును గావలసినవిగావు. అవి స్వశక్తిచేతనే యన్నిటి యందును జెల్లును. అవి యనివార్యములు. అప్రతిహతములు. రాజశాసనముల దిక్కరింప వచ్చును. తప్పించుక పోవచ్చును. ప్రకృతికి మించినడుచుట యసంభవము. దొంగలించినవాడు పోలీసువారికి లంచములిచ్చి సుఖముగా దప్పించుకొని యుండజూచుట యసాధ్యమునుగాదు. అసాధరణమునుగాదు విషము మిక్కుటముగదిని బ్రతుకు దక్కించుకొనవలయునను నాశతో కాలమునకు యమధర్మరాజునకును లంచము లియ్యనెంచు వారెవరు నుండరు: ఏలన, కాలము, యమధర్మరాజు మొదలగు నధిదేవతలు స్వేచ్ఛా వర్తనములేని ప్రకృతులు.

రాజశాసనములు స్వేచ్ఛావర్తనగలవారిచే నేర్పఱుపబడునవి. ప్రకృతిగతులు వస్తువులయు జీవులయు స్వభావము ననుసరించిపోవును.

అది కావున రాజశాసనములంగూర్చి ధర్మాధర్మ విచారణచేయుట సాధ్యమును, కర్తవ్యమును. చూడుడు! మనవారెల్లరు చట్టము లనేకములు నీతిపథములు గావనివాడుటయే ఇందునకు దార్కాణము. అడవుల బశుసంతానములు విచ్చలవిడి మేయగూడదనియు,