పుట:Bhaarata arthashaastramu (1958).pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారితో పోటీచేసి యమ్మకము సంపాదింప వలయునన్న నెట్టిపదార్థముల నేరీతుల నేధరలలోపల సిద్ధ పఱుపవలయునో యనుట నిర్ధారణం జేయవలయు. ఇవి యల్పులచే బరిష్కరింపబడు యత్నములా? దీర్ఘాలోచన, యగోచరార్థ విజ్ఞానము, భవిష్యద్వర్తమాన పరిశోధన, ఇవి పంచాంగముల కట్టలచేగాని బల్లిపలుకులలోగాని తేలవు. మఱి వ్యవహార నిర్మాతలయందు ప్రతివాసరానుభవ సంప్రజ్ఞాతములైన విద్యలుగానున్నవి. మాన్‌చెస్టరులోని కార్యచోదకులు, ఇక్కడివానల సంగతి, పంటలతెఱంగు, మొదలగువానిని గవర్నమెంటువారి ప్రకటనలు, తమనౌకరులు, ప్రతినిధులునుబంపు వివరణపత్రికలు, వీనిచే నెఱింగి తమఫ్యాక్టరీలలో జేయింపవలయు వస్తువుల పరిమాణము తీర్మానింతురు. ఇదియే ఘనమైన కార్యంబనగా దీనికి మించిన ఘనతర కార్యంబొండుగలదు! అదియేదనగా, పూర్వం గిరాకి నెఱింగియో యుత్తరువుల బొందియో యుత్పత్తి చేయుచుండిరి. ఇప్పుడు గిరాకి లేకున్నను, రుచిచూపిన నాశలు తమంతట బుట్టునను నూహచే, వస్తువులను గొంతమాత్రము తయారుచేసి జనులు వీనిం గొందురా లేదా, యని పరీక్షించుటయు గలదు. ఈ సాహసము నేమనవచ్చును? ఉపయోజకుల మనసులో నాసబుట్టింప నేరనివైన, విక్రయములేక, వేసిన మూలధనంబంతయు నష్టమగును. ఒకవేళ జనుల మనసుల నాకర్షించెబో నవీనమును ననన్యరచితంబును నగుటజేసియు, నరుదు గావునను గిరాకికొలంది వెలలవిధించి యమితలాభంబు వడయవచ్చు. రుచుల సృజింపజూచు వ్యాపారలక్షణ మేమనగా, మొదటికే మోసం వచ్చినను వచ్చును. లేదా సర్వసంపదలైనను గుదురును. ఊర్ధ్వ గతియో యథోగతియో ఈరెంట నొకటి తప్పదు. కొన్ని సమయములలో తలచినంత శీఘ్రముగ వస్తువులపై నామోదంబు గలుగకున్నను, ధైర్యము వదలక వేచి మంచికాలము నిరీక్షించి తుదకు లబ్ధప్రాభవులైన వారెందఱో యున్నారు. భావికాలము నాశ్రయించిన