పుట:Bhaarata arthashaastramu (1958).pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుణములైన వృత్తులలో నియమింపజేయ వచ్చును. కొన్ని యంత్రశాలలలో కుంటివారికి సైతము కూలి దొరకుచున్నది.

కావున శ్రమవిభాగ మిఱుదెఱంగుల శుభావహంబు. బలాఢ్యులు కళాదక్షులు నైనవారిని శ్రేష్ఠతర ప్రయత్నములయందే యస్ఖలిత వృత్తులంజేయుట యొకటి. బలహీనులు మందులు వికలాంగులునైన వారినిగూడ వ్యర్థులం జేయక యుచితగతి సమర్థులం జేయుట రెండు.

           3. "అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
               దినగ దినగ వేము తియ్యనగును"

అన్నట్లు. ఏకక్రియారూఢిగ బనిజేయువారికి దానియందు పాటవము ప్రబలమౌను. మ్రానిపనియే చేయుటంజేసి వడ్రంగి దానియందితరుల కన్న నెక్కువ కుశలుండైన విధంబుననె యావడ్రంగియొక్క క్రియల సైతము విభజించి పంచిపెట్టిన నాప్రత్యేక క్రియలందు నిరంతరాభ్యాసము గలవారు సర్వక్రియా భారము వహించు వడ్రంగికన్న నధికచాతుర్యముగలవా రౌదురనుట సుబోధమేగదా1

శాస్త్ర విచారణయందు నీన్యాయము చూపట్టెడు. అల్పవిద్యావిదు లనేక విద్యల నేర్చినవారుగాను, పాండిత్య గంభీరులు కొన్నింటి మాత్ర మామూలాగ్రముగ జర్చించిన వారుగాను నుండుట మనకెల్లరకు ననుభవవేద్యము. పల్లెటూరి పురోహితుడు రైతుల యెదుర జ్యౌతిషము, వేదాంతము, తర్కము, సాహిత్యము, మొదలగు నన్నియు దెలిసినట్లు నటించును. నిజముం జూడబోయిన వాడు నిరక్షరకుక్షి! విశారదులైనవారొక తర్కమో వేదాంతమో చక్కగా నెఱింగినం జాలునని యావజ్జీవము కృషిసేతురు. దీర్ఘాలోచనాపరులు గావున నవీనశోధనలకు నూతనవృత్తాంతములకును వీరుజన్మ స్థానములు.

4. పనులనుండి వేఱుపనులకు దిగవలయునన్న కాలము నష్టమౌను. ఏక కార్యస్థితులమై యున్న కాలవ్యయంబు గలుగదు. వర్త