పుట:Bhaarata arthashaastramu (1958).pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

                క. ధనమునకై ధర్మము దెస
                   ననాదరముచేసెనేని నా నృపతికి వ
                   ద్దనమును జెడు దుర్యశముం
                   బనుగొను దుదిదుర్గతియును బాటిలుననఘా.

అను భారతనీతికి ఇండియాదేశపు ప్రాచీనరాజుల చరిత్రంబులు విస్పష్ట ప్రమాణంబులు.

కావున దారిద్ర్యమనునది సుగుణములవలన గలుగు ఫలము గాదు. మఱి దుర్గుణముల ఫలమే. ఏదేశమున బీదతన మెక్కువగ నున్నదో యా దేశము జనుల దుర్మార్గావలంబనముననే యట్టి దశకు వచ్చెననుట నిర్వివాదాంశము. ఏమియు లేనివాడు తప్పుచేయడనుట నిజమేకాని, తప్పుచేయనందున ఏమియు లేనివా డయ్యెననుట నిశ్చయముగాదు. బీదలు విధిలేక మంచివారుగా నుండిననుండవచ్చు గాని, అది కారణముగ మంచివారెల్లరు బీదలుగా నుండవలయుననుట యసంబద్ధప్రలాపము. దీనినే మఱియొకరీతిని దృష్టాంతీకరింపవచ్చును. మంచిప్రాయమున బసవెద్దురీతిని వర్తించి వ్యాధిగ్రస్తుడై అన్నియు నుడిగి యొకడు కాలక్షేపార్థము వేదాంత వాదంబులకు దొడగి విభూతిధారణం బొనరించినంతనే, బలహీనత సత్ర్పవర్తనకు మూలాధారభూతంబని సిద్ధాంతము జేయబూనుట హాస్యాస్పదముగదా ? తొలుతనుండియు మంచిత్రోవనేయుండిన బలహీనత యేల సంభవించును ?

ఈ హిందూదేశము తొలుత మంచిస్థితిలో నుండినది. కాలక్రమేణ జాతిమతాదిభేదములు ప్రబలమై, మూడభక్తిదురాచారములు జనులబుద్ధిని మెండుగ నాక్రమించుటజేసి, మనవారు పౌరుషం, ఐకమత్యము పోగొట్టుకొన్నవారై, పరులపాలై తన సర్వస్వమును గోలుపోయి తుదకిట్లు నిరంతర దారిద్ర్యస్థితి ననుభవింపవలసివచ్చిరి. 'తమకంపు తమకింపు' అను సామెత ప్రకారము ఈ దారిద్ర్యమే