పుట:Bhaarata arthashaastramu (1958).pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సబాధ నిర్బాధ స్పర్ధలు మిళితములై యుండుట యసాధ్యము గాదనుట కొకనిదర్శనము. వైరముండుటచే నొకరిని మీఱవలయునని యొకరు నూతన పరిశోధనలంజేసి నవీన యంత్రసృష్టిజేయ నుద్యమింతురు. యంత్రసృష్టికిని గాలముగావలయు. సెలవు జేయవలయు. ఎన్నియో పరీక్షలం జేయవలయు. వీనిలో ననేకములు కాయలుగా వచ్చును. పండౌనది యొక్కటి మాత్రము. ఇట్లు బహుశ్రమవ్యయములతో గనిపెట్టబడిన యంత్రమును, ఇతరులును స్థాపించు హక్కుగలవారై యున్నయెడల నిర్మాణకారునకు లాభము లేకపోవును. వైరులును తుల్యసామర్థ్యులై పోటీచేతురు. కావున గవర్నమెంటు వారొక శాసనము జేసియున్నారు. ఏదన, ముందెవ్వరు నెఱుంగని యంత్రముల నెవడైన గ్రొత్తగగల్పించిన, ఇరువదియో ముప్పదియో నియమిత సంవత్సరములు వాడుదక్క నితరులు దానిని పరిగ్రహించి యుపయోగింపగూడదని. అట్లుపయోగింపగోరిన, వానికి బాడుగనిచ్చి యజమానత బడయవచ్చును. కొన్నివత్సరములకేయని పరిమితి బెట్టినందులకు గారణమేమన; ఒకటి, తనవెనుక వచ్చువారికి దాని సొంతము నేల యియ్యవలయును? తండ్రి దక్షతజూపిన బుత్రుల కది సమర్పింప నేల? కావున నొక జీవితకాల మంతయు సర్వాధికార వర మొసంగినంజాలు. రెండవది. సమాయా నంతరమున హక్కులు వికలము లౌననిన నంతలోన నింకను విశేషించిన గురునిర్మాణములం బొందింప జూతురు. అందుచే దేశమునకు వృద్ధి యతిశయిల్లును. మూడవది. ప్రజల శక్తియుక్తులపై సంఘమునకు బాధ్యతలేదా? మన ఉద్యోగములన్నియు తుదకు దేశసంఘముంజేరిన నెల్లరకు శుభమె. చూడుడు! మాత్సర్యము, నిర్మాత్సర్యముగ ఫలము ననుభవించుట, ఈరెంటిని బదిలపఱిచినం గాని నూతనసృష్టులకుం బ్రోత్సాహముండదు. సాహసం, రక్షణము, ఇవిరెండును ఉత్పత్తికి మూలములు. గడించినవి తన్నే చెందునని నిశ్చయము లేకున్న వస్తుసంపాదనముతో బనియేమి? ఇక