పుట:Bhaarata arthashaastramu (1958).pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱల బనులం బ్రవేశించి మునుపటియట్ల జాగరూకతతో మెలంగుచున్నారు. ఐరోపీయనులలోనుండు నొకదివ్యగుణ మిందు సువ్యక్తం బయ్యె. ఎంతపోరినను పోరుచాలించినతోడనే కల్మషములేని హృదయముతో నొడంబడిక ప్రకారము త్రికరణశుద్ధిగ వర్తింతురు! "పని యీనాడు వదలుదుము" అని కొన్నిరోజులకుమున్నే యజమానులకు విన్నవించి యానాటివఱకును సేయసమ్మతమును లేనియట్లు మెలకువతోవర్తించి సమయమాగతమగుడు విసర్జించి వెడలుదురు. యజమానులును పనివా రిట్లనిరేయని నీచపుం బగదాల్పక వేతనములు, కాలము మొదలగునవి చల్లని మనసులతో నిర్భేదముగ విధింతురు. పెనకువలన్నియు దీఱిన పదంబడి ప్రణయ కలహానంతరం నాయికానాయకు లట్లు పరస్పరానురాగపూరితులై పొత్తుదాల్తురు. "నాలుకబెల్లము, ఎడదకత్తెర" యను కపటము, కుటిలస్వభావం, వీనిపొంతకు రాజసగుణులెన్నంటికింబోరు. నక్కవినయములుచూపుచు స్తోత్రములు పఠింపుచు సత్త్వగుణగరిష్ఠులమని చరింపుచున్నవారిలో నుండునంత గూఢభావము, కౌటిల్యము, మ్రుచ్చుందనము, నమ్మిక ద్రోహము, ఇత్యాది దుర్గుణములు క్షత్రియ తేజంబుండు వారియెడ ద్రవ్విచూచినను దొరకదు. మనదేశమున రజోగుణము ద్వితీయ మన్నందుననే మోసములు మెండయ్యె. అయ్యది యద్వితీయమును, అత్యంతసేవ్యమును, అనుట చరిత్రశోధనముం జేసిన వారికెల్లరకుం దెల్లంబ. అది యట్లుండె.

ఇంగ్లాడులో రైల్వేనౌకరులందఱు జీతములు జాస్తి చేయవలయునని ప్రార్థించి, తమప్రార్థనకు సరియైన యుత్తరముం బడయనివారై, కొన్నినెలలక్రిందట*[1] పనిచాలించిరి. ఇట్లు పనిచాలించుటకు, కర్మోపసంహారమనిపేరు. అపారమైన వాణిజ్యమె బ్రతుకుగాగల రాజ్యములలో రాకపోకలు నిలిచిన గతియెట్లు? కొన్నిపట్టణములలో

  1. * 1912 వ సంవత్సర ప్రారంభమున.