పుట:Bhaarata arthashaastramu (1958).pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారు. కర్మకరులును మేరలేని మాత్సర్యము వినాశహేతువని శ్రేణులుగా గూడుచున్నారు. వర్తమానమున నెల్లెడలజూచినను జనులు తమకుం దాముమాత్రముగ నెల్లరతోనెదిరి యప్పళించుట మాని, సంఘములుగజేరి వ్యూహములు వ్యూహముల, సైన్యములు సైన్యములరీతి ప్రతిఘటించెదరు. ప్రతి వ్యవహారములోను యజమాన సంఘములు భృత్య సంఘములు దినదినమును బయలు దేరుచున్నవి. దేశ దేశములనుండు కర్మకరులు ఒండొరులతోను, యజమానులు తమలో దామును మిత్రత్వము నెఱపుచు నార్థికకలహముల దోడుపడుట యుంగలదు.

పై వాక్యమునకు వ్యాఖ్యానములేనిది యర్థము స్ఫుటంబుగాదు. వృత్తుల పరిణామముంగూర్చి వ్రాయు సమయంబున ఒకవిషయంయొక్క ముఖ్యతను దగినట్లు విశదపఱుపలేదు. ఏదన, గ్రామ్యశ్రేణి పద్ధతులలో కూలివారే యుపకరణములు మొదలుగ మూలధనములను గలవారుగా నుండిరి. అస్వచ్ఛందములైన నివేశనావేశవృత్తులలో దొలుత గూలివారికి మూలధనసంపత్తిలేకయుంట తటస్థించును. వ్యవహారములు నెగడి నివ్వటిల్లంజొచ్చిన యంత్రాదిసాధన నిచయంబులకు మూలార్థ మతిశయముగ వలయుగాన కర్మకరులు యజమానులై సొంతముగ గళల నిర్వర్తింపజూచుట యరిదితలంపు. పూర్వమున, నేడు కూలివాడుగా నున్నవాడు రేపు సొంతగాడు గావచ్చును. ఆధునికమున నియ్యది కష్టతరసాధ్యముగాని యలతులం దీఱునదిగాదు. కావున శ్రమకరులనువారు ప్రత్యేకపు దెగవారై యెంత తపస్సుచేసినను యజమాన పదవినందుట దుర్ఘటంబు గావున వారితో గలయికలేనివారై యుండవలసివచ్చె. ఇందుచే వ్యవహారచక్రమంతయు కర్మ భర్తలు, కర్మకర్తలు నని రెండుతెగలుగ భిన్నమై సంఘముయొక్క యన్యోన్యతకు భంగకరమో యనునట్లున్నది. ఈ యంశమునకే కొందఱు "శ్రమ మూలధనముల వియోగం" బని పేరిడిరి.