పుట:Bhaarata arthashaastramu (1958).pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చాటుచున్నవిగదా ? ఈషణత్రయంబులలో నొకటి యగుటచే ధనమునం దాసక్తితగదనియు, మఱియు నర్థంబు చతుర్విధపురుషార్థంబులం దొండగుట నవశ్యంబు గాంక్షింప దగినదనియు నదేభారతమున జెప్పబడియున్నది. ఇం దేమాట నమ్మవలయు ? నేది విడువ వలయు ? ఇట్లొక విషయమేకాదు. అన్నియెడలను మనశాస్త్రంబులలో నొకటి కొకటి సంబంధములేని యిట్టి ప్రలాపములు పెక్కులు గలవు. కాన నాశాస్త్రవిచారణ యటుగట్టిపెట్టి మనుజులకు స్వతస్సిద్ధమగు బుద్ధి నుపయోగించి పురుషార్థములలో నెల్ల నిప్పటికి ముఖ్యమగు నర్థముయొక్క తత్త్వమును గ్రహించుట ప్రధానకార్యంబు.

అర్థార్జనము సర్వపాతకంబులకును కారణభూతంబని యనేకులు నమ్మెదరు. అందులకు నిమిత్తంబు లేకపోలేదు. అబద్ధములు చెప్పుట, దొంగతనమునకు బూనుట, అన్నదమ్ములతోను, బంధువులతోను గలహించుట మొదలగు చెడుకార్యములను మనుజు డవలంబించుట యర్థము నాసించియేకదా ! నిజమేకాని మఱి ధనసంపాదనమునకు మంచిత్రోవలులేవా ? చూడంబోయిన నీయాక్షేపణ ధనము నార్జించుట మాత్రమున కననేల ? ఇతర పురుషార్థము లన్నిటికిని జేయ వచ్చును. మోసముచేసి విద్యను గడించువారు లేరా ? మనవారిలో వివాహకాలమున వేలకొలది దబ్బఱలాడుట సదాచారములలో నొకటిగ నుండలేదా ? అట్లగుట నెపంబుగ విద్యావివాహములు విసర్జనీయములని వాదింప గూడునా ? ఇంచుక యాలోచించినచో,

                     "ఎద్దానిఁ జూడఁ బోయిన
                      నద్దానన్ గీఁడు మేలు లమరియ యుండున్"

ఇంతేకాదు. మొత్తముమీద ధర్మగుణము లెక్కువగ నుండిననేగాని యెట్టివారును నైశ్వర్యవంతులు గానేరరు. సత్యము, ధైర్యము, దమము, దీర్ఘదర్శిత్వము ఇత్యాద్యుత్తమ గుణంబులు ఏదేశమున మిక్కుటముగ నుండునో యందేగాని యితర రాజ్యంబులలో లక్ష్మీ స్థిరముగ నెలకొనదు.