పుట:Bhaarata arthashaastramu (1958).pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోతిరాసరి, లేకున్న గొట్టముల ద్వారా నేను పంపుదును. అట్లైన నాసరకు మీకేమియు దక్కదు. అందుచే నష్టపడువారు మీరో నేనో చూచికొందము!" అనిన రైల్వేకంపెనీలవారు "వీడసాధ్యుడు. చెప్పినదెల్ల జేయు నంతటివాడు. యానవేతనముల దగ్గించకుంటిమా యొక బండినూనెయైన మనమూలకముగ బంపడు. వీనింజూచి ఇతరులును మనల నడ్డజేయక పోయిన జెప్పరాని నష్టమౌవును. సర్కారువారి యాజ్ఞయో పక్షపాతములేక యేకరీతినే కూలి విధించవలసినదని యున్నది. ఏకరీతినూనిన నేరీతియులేకపోవును. ఏమిచేయుదము?" అని తర్కించి విధిలేక రహస్యముగ నొడంబడిరి పిమ్మట 'రాకపెల్లరు' చిల్లర నూనెవర్తకుల జూచి "మీవ్యాపారమంతయు నాయధీనముగ జేయుడు. మీకు మంచి సంబళము లేర్పఱచెదను. ఒకనికిలోనై యుందుమా మేమని గర్వముచే నిరాకరించితిరేని మీయూరులలో చుట్టుప్రక్కల నాయంగడులనిలిపి అతిసరసముగా విక్రయించెదను. నాకు నష్టమనియందురో, ఇట్టి వెన్నికలిగినను, ఏనుగును దోమ గుట్టినట్టు నాకు లక్ష్యములేదు. మీరు నానష్టములో శతాంశమునకైన నోర్వలేక నాశమెత్తుదురు. భద్రము" అని చెప్పి వారిపై దండెత్తిన వారలు పాపమేమిచేతురు? లొంగినవారులొంగిరి. తిరస్కరించినవారాతని స్పర్ధదెబ్బ దగులగనే తోకలుముడిచికొని కాళ్ళు నాకవచ్చిరి. ఇట్లు చిల్లరవ్యాపారమంతయు దనదైనపిదప గొప్ప వ్యవహారికులను నదేరీతి నణగద్రొక్కి ప్రపంచమున నించుమించు నాల్గవపాలు వ్యాపారమునకుం జక్రవర్తియై యెదుటివారులేక పోటీలను భయము కలలోనైనగానక, తనసరకులు బర్మా, ఇండియా, ఇత్యాదులగు తూర్పుదేశములమీదను విజృంభింప నిర్వక్రముగ కిరోసెన్‌నూనె సార్వభౌమత్వము నందియున్నాడు, స్పర్ధ స్పర్ధచే నెగురగొట్టబడినందుల కిట్టితార్కాణము లెన్నేనిగలవు. రాకిపెల్లరు గారింగూర్చి యొక మంచిమాట జెప్పకపోవుట యన్యాయము.