పుట:Bhaarata arthashaastramu (1958).pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐరోపా అమెరికావారు మనతోబలె మనము వారితో మత్సరింపలేము. మన దౌర్భల్యమునకుం గారణములు జాతి మతాది భేదములు, దేశయాత్రా పరాఙ్ముఖతం బుట్టించు నాచారములు, రాజసభావములేక విధేయులమై యుండవలసిన దురదృష్టము, ఇత్యాదులని మున్నే పలుమాఱు వక్కాణించితిమి. చూడుడు! పాశ్వాత్యుల వర్తకులు, శిల్పులు, తూర్పుదేశములం బ్రవేశముంగోరిన, మనవంటివారు నివారించిరేని ఫిరంగులతో వాదించి త్రోవదీతురు. ఆసియా ఖండనివాసులు బలహీనులగుట నీతర్కంబు వాఙ్మనస గోచరంబైనను శక్తి సాధ్యంబుగాదు. దక్షణాఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, కనడా ఈ ప్రాంతములయందు తెల్లమూతిలేనివారు కొన్ని నియమములకు లోబడికాని రాగూడదని శాసించియుండుటం జూడగా, మనదేశమున మనుస్మృతి ప్రభావము హీనమౌచుండుటందలంచి మన ధర్మదేవత దానికిం బాశ్చాత్యుల తిరస్కారముం దోడుచేసి యాచారముల నిలుప బ్రయత్నించు నట్లు తోచెడిని! బలపరాక్రమ సంపన్నులమై దిక్కులెల్లనైన సాధింపజాలినవారమై యున్నతఱి భరత ఖండమే శరణ్యమనియు నితరాశ్రయము లశస్తములనియు నియమము లేర్పఱచికొని, సొంతముగ మనకాళ్ళకు మనమే సంకెలల దొడిగికొని కూరు చుంటిమి. ఇపుడు బయటబోదమను బుద్ధి వచ్చినదిగాని ఇది వచ్చుతఱికి శక్తి వెడలిపోయె! ఇచ్చయున్న శక్తియు, శక్తియున్న నిచ్చయు లేనిబ్రదుకు మనవారు ప్రయత్నించి గుత్తయెత్తిరికాబోలు!

స్పర్ధవలని లాభనష్టములు

ఆర్థికవిషయమైన స్పర్థ యంతటను సమముగ బర్వక కొన్నియెడల మిక్కుటమును గొన్నియెడల లేశమునై వివిధగతుల వెల్గును. ఇక దీనిచేగలుగు లాభనష్టంబుల నిర్దేశింతము:-