పుట:Bhaarata arthashaastramu (1958).pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొనర్చుటకు గావలయు ద్రవ్య సంచయములు తంతిగొట్టి బ్యాంకుల ద్వారా అమెరికావారు పంపుదురు. ధనరూపములైన మొదలు మొత్తమ్ములు పాదరసమువోలె నిలుకడలేక చరించు స్వభావము గలవి. మూలధన స్పర్ధ, శ్రమ స్పర్ధ యట్లు ఏకదేశస్థముగాక నిష్పక్షపాతమైన సర్వవ్యాపిత్వముం బూనియుండు. మనదేశముననుండు రైల్వేలు యంత్రశాలలు మొదలైన మహావ్యవహారముల నుపగతమైన పుంజిపటలము దేశదేశములనుండి తేబడును గనుక, మనమును అధిక త్వరతో ధనప్రయోగమునకుంబూనమేని, ఇతరులా సందుజూచికొని ప్రవేశింతురుగాన, మనధనమ్ములు నిరర్ధకములై మూటలలో బ్రచ్ఛన్నములై యుండవలసివచ్చును. వస్తువులు, సమాచారములు, నేకొఱతయులేక, కాలవ్యయముంగాంచక, తలచినప్పుడు పంపం గలుగు యానశక్తి యుద్ధృతం బౌటంబట్టి, దేశభేదములచే నబాధితమౌ మూలధనమ్మునకు లోకము రాజ్యమట్లును, రాజ్యము లిండ్లయట్లును సులభముగ బొందదగినవయ్యె.

మనశ్శ్రమకరుల స్పర్ధ

మఱియు శిల్పములు జేయుచు గాయకష్టమున శరీరయాత్ర నడుపువారు ప్రవాసమునకుం దగనివారైనను, కార్యవిచారణ, వ్యవహారనిర్మాణదక్షత, మానేజరుపని, ఇత్యాది మనశ్శ్రమలచే నుల్లసిల్లువారు, ఎల్లెడలకు నెక్కువ సుకరణముగ బోవచ్చుగాన నుత్కృష్టోద్యోగములలో దేశదేశములకు స్పర్ధయున్నది. బొంబాయిలోని ప్రత్తిశాలలలో విచారణకర్త లనేకులు యూరోపియనులు. ఏలూరిలో స్థాపింపబడిన జనపనార శాలయందును ఇంగ్లీషువాడొకడు మానేజరుగా గొంతకాల ముండెననియు నాకు వినికిడి. కాఫీ, టీ, రబ్బరు, వీనియుత్పత్తి, వ్యాపారములు ఇంగ్లీషువారే స్వయముగ నిచటకు వచ్చి నెఱవేర్చుచున్నారు. విద్యాధనముల ఖండములుగనుండిన నేదేశమునకైన నిరాబాధముగ బోవచ్చును, రావచ్చును, సన్మానములం బడయవచ్చును.