పుట:Bhaarata arthashaastramu (1958).pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భంగముంగావించి పురుషకారోద్రేకం నంత మొందించును. ఎట్లున్నను ఎక్కువ వారమని శ్రేష్ఠాన్వయులును, ఎంత ధనగుణవిభవోపేతుల మైనను తక్కునవారమేయని హీనవంశస్థులును, ఉద్యమములకుం జొరక బీడువడి చెడుదురు. తుట్టతుదకు జగంబెల్ల కర్మనియంత్రితమని మగతనముం గోలుపోదురు. జాతిసంకరము లను గ్రహణీయములని నిర్ణయించి, పరస్పర సంబంధము గలవారై యుండిరేని, ఒకయింటిలోనే భిన్నవృత్తులుగలవా రుందురుగాన నిప్పటియట్లు వ్యత్యాసములం బచరించుట కనువుండదు. వ్యత్యాసములున్నను ఇప్పటివలె ననిర్వాహ్యములై కఠోరములై యుండజాలవు. సాంగత్యమున దేహమానసోల్లాసంబులు వికాసముంబొంది పరిఢవిల్లు. దేశమును ఐకమత్యముంగొని యయోధ్యమైయుండును. వృత్తులలో నిరాబాధముగ గోరినవారికిం బ్రవేశమున్న దరుణముకొలది సంఖ్యలధికములై గంభీర వ్యాపారములలో శ్రమ విభజింపబడుట యెక్కువ సమర్థమై యుండును. సంఖ్యలు మితములు నల్పములునునైన ప్రయాస విశ్లేషణము దుర్ఘటము. విశ్లేషలేనిది సమృద్ధి సర్వమంగళం.

ఆంగ్లోమహాజనుల రాజ్యములో పక్షపాతము ధర్మగుణమని పరిగణింపకబడక, ప్రజలనెల్ల సమదృష్టిం జూచుట న్యాయంబని ఏర్పడియున్నదిగాన, స్వచ్ఛందవృత్తిమై నుండుటకు నవకాశములున్నను, పూర్వవాసనా బంధదోషంబునంజేసి, కాళ్ళుగట్టబడి చాలకాలమున్నవాడు సంకెలల దీసినను లేవలేనియట్టును, అంధకార సంచారులను వెలుతురికిం గొనివచ్చినను గన్నులు విప్పని పగిదిని, మనము బెదురెద్దులమాదిరి దిగ్భ్రమం జెందియున్నాముగాని నూతన సామాసాదితమైన స్వతంత్రతను అలవఱచికొని యనుభవమున నింకను నుపయోగింప నున్ముఖులముగాలేదు. బ్రాహ్మణు లొక్కరు మాత్రము విద్యావంతులు, చతురులు, సాహసవంతులు నగుటంజేసి, కాలదేశముల ననుసరించి పోవుటలో నితరులకన్న ప్రవీణులై పఱగెదరు.