పుట:Bhaarata arthashaastramu (1958).pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యలతిగాన పనినొక యరగంటలోముగించి చేతు లారవేసికొని కూర్చుండును. ఒక్కనిమాత్రము నియమించిన నరదినము పనియైన జేయును. మైళ్ళకొలది వ్యాపించిన తోటగల సాహుకారి యొకరిద్ధఱినిమాత్ర మన్నికార్యములం గొనసాగింపుడని పలికిన పని యేనాటికిని ముగింపునకురాక వెనుకబడుటయేకాదు. కోసినకాయలు వాడువాఱి చెడును. కోయుట, దింపుట, నింపుట, కుట్టుట, కట్టుట, బండ్లకెత్తుట, తోలుట మొదలగు పనులకు మేరకొలది వేఱు కూలివాండ్ర నియోగించిన కాలమునకును బంటకును దేనికిని జేటురాదు గాన, విభజనము ననుసరించి పనియుండుట నిజమేయైనను, పని ననుసరించి విభజనము నేర్పఱచుటయు గర్తవ్యమె.

శ్రమ విశ్లేషణము, తత్పరిమితియు

ఉత్పత్తి వాణిజ్య దేశాభివృద్ధ్యాదు లుద్ధరములౌటకు మూలమయ్యును, ఫ్యాక్టొరీల ప్రగల్భత శిల్పుల స్వతంత్రత యను లతకు గొడ్డలివంటిది. ఉండిన స్వేచ్ఛయుబోవును. సాధనసామగ్రులు, ఆయుధములు సర్వమును యజమానులకే చేరినదిగాని తమకు జీతమునందక్క నింకెందును సత్త్వము పరిహృతము. ఏవస్తువుల నెవరికై యెంతమాత్రము రచింపవలయునను మొదలైన చింతలు విచారణయు యజమానులకేకాని తమకుంగాదు. యంత్రములలో జంగమ యంత్రములట్లు "ఏమి? ఏల" యని యడుగక మూగలట్లుచెప్పినది చేసి యూరకుండుటయె తమధర్మమగును.

వృత్తులు విశ్లేషించుటమేలనియు, శ్రమవిశ్లేషణ మంతకన్న సమర్ధమనియు సూచింపబడియె. శ్రమవిశ్లేషణ కధికసంఖ్య లావశ్యకములు. సేవకుడొకడుమాత్రమున్న నన్నిపనులను వాడే చేయవలసి వచ్చునుగాన, పూనికల వేఱుపఱచుట యసంగతము. గిరాకి యపారమైనచో వస్తు సృష్టికిం గావలసిన ప్రతిక్రియను వెవ్వేఱుజనులచే జేయింపవచ్చును. ప్రయాస వ్యవచ్ఛేదమునకు పరిమితిని గల్పించు తత్త్వములు మూడు. అవియేవన:-