పుట:Bhaarata arthashaastramu (1958).pdf/291

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చేయువారివలె గొఱముట్లులేనివారు. సన్నాహముల నన్నిటిని యజమానులే చేయవలయు, శిల్పులన్ననో సాలెలు, వడ్రంగులు మొదలైనవారిం బోలెదరు. ఆయుధములు, నూలు, కొయ్య ఇవన్నియు వారికింజేరినవె గిరాకిదారులచే నీబడునవికావు. కంసాలులు ఈరెండు విధములనుజేరక మధ్యమరీతులుగా నున్నారు. పరికరములు వారివే యైనను పక్వపఱుపబడు బంగారు రత్నములు నాజ్ఞాకరులచే నియ్యబడియెడునవియే.

పరులు పోటీకివచ్చిన నుండునదియు బోవునేమో యను భీతిచే తమచక్రమున నితరులురాగూడ దనియు అందులకు బదులు తామొరుల చక్రమున బ్రవేశింపమనియు సమయములంజేసికొని ఆయా చక్రములవారు వారి వారి సీమల నెదురులేనివారై యుండిరి.

చూడుడు! వర్ణశ్రేణులకుండు సామాన్య ధర్మంబు. వర్ణస్థులు తమలో తమకేకాని, ఇతరులతోగాని, తదితరులచేగాని, స్పర్థలేనివారు. శ్రేణులు నట్లే. ఇక భేదగుణంబు లెవ్వియనిన; శ్రైణికులు తమలోనేకాక యిచ్చవచ్చినచోటుల వివాహ సంబంధముల నేర్పఱచు కొందురు కాన జాతులుగా నేర్పడలేదు. రెండవది - శ్రేణులు స్థానీభావము ననుకరించునవి. గ్రామములట్లు దేశముల నాశ్రయించిన సత్త్వముగలయవి. ఇందునకు దృష్టాంతము. పేరులు ఊరులబట్టి వచ్చును. ఉదా. ఏలూరి కంబళ్ళవారు, విశాఖపట్టణపు దంతవువారు ఇత్యాదులు. కులభేదములు దేశభేదముల నూనినవిగావని మున్నే చెప్పితిమి సాలెనా రెన్నియూళ్ళలో నున్నను వారందఱు నొకతెగవారు. శిల్పసామాజికులు తమలోనేకాని వెలుపల పెండ్లిండ్ల జరుపమని సంకేతించి యుండిరేని యూరోపులోను జాతులు పుంఖాను పుంఖములుగ వెలువడియుండును.

పరతంత్ర పద్ధతులు

పైనుదాహరింపబడిన పద్ధతులన్నియు నొకరీతి జూడబోయిన స్వతంత్రములని చెప్పవచ్చును. ఎట్లన, శిల్పులు తమ సామానులకెల్ల