వర్తింతురు. ఆహా! గ్రామ్యధర్మమునం దుపగతమైనబుద్ధి దేశ్య ధర్మము నవలంబించి ప్రసరించెనేని ఎంత తేజోవంతముగా నుండును! ఇట్లు ప్రసరింపక పోవుటకు గ్రామ్యబుద్ధితో నెట్లో సంకలితమై దానిని గుదింపంజేసిన కులబుద్ధియే నిందాపాత్రము. ఇవి రెంటికింగల పరువేదియనిన గ్రామభక్తి దేశభక్తివలె స్థానము ననుకరించ యుండును. జాతులెట్లుండినను ఏకగ్రామనివాసులు స్థానబాంధవ్యముచే మనవారిని తెలిసికొందురు కావున నిది యేకీభావమును జనింపజేయు గుణము. మఱి యెంతయు బ్రశంసనీయము. కులభక్తి యిట్టిదిగాదు. పరస్థలముల నివసించుచు ముక్కు మొగముల నెన్నడెఱుంగని వారును సంతతి ననుసరించి యన్యోన్యముగా బరిగణింపబడుటయు, ఇరుగు పొరుగు వారలయ్యు జాతిసామ్యములేనిచో పరులని వెలితిగ జూడబడుటయు దీని మాహాత్యము. కావున నిది దేశదారిద్ర్యమునకును, ఐకమత్యా భావనమునకును ముఖ్యకారణము. ఉత్పాతబీజము స్థానాను గతములైన భావములు సముచ్చాయక శక్తులు, తదితరములు విచ్ఛిద్రశక్తులు. మనదేశములో జాతి, మత, వేష, భాషాదులు విచ్ఛిద్రశక్తులనుటకు గొంకనేల? సముచ్చాయకశక్తియైన దేశానురాగము మాటల దలంపుల గోరికలం బొడసూపెడుంగాని మనదేశమున నింకను గొందఱి యందుదక్క చదువుకొన్నవారియందైన ననుష్ఠానముగ సామాన్యముగ నుదయించినదిగాదు.
గ్రామ్యకులపద్ధతులు మన సుఖదు:ఖముల కన్నిటికి నుత్పత్తి స్థానములు, నెల్లలును గావున విపులముగ జర్చింపవలసివచ్చె. అయ్యవి యీ దేశమునకు దలవ్రాత వంటివి. దేశపద్ధతి యిప్పుడిప్పు డక్కడక్కడ మొలకెత్తుచున్నది. ఇది విజృంభించి వైరి పద్ధతులం గీటడంచి వ్యాపించినం గాని దేశమున మనమానప్రాణంబులు రక్షితంబులుగావు.
3. ఉత్తరువుల మేరకు శిల్పులుత్పత్తి సేతురుగాని యిప్పటి యట్ల గిరాకి నెదురుసూచి సరకుల దయారుచేయరు. కారణము