నవలంబించి యుండును. ఒకటి లేనిచో నింకొకటి బ్రతుక జాలదు. మృగంబుల కివిరెండును లేకుంటయె యిందులకు దార్కాణము. జనులలోగూడ మొలబట్టలుసైతము సరిగా ధరింప సమర్థులుగాని యంత్య కులజులు దూషణ భూషణ తిరస్కారంబులకు నెడమై జడులై వుంటం జూడ మనసులు కరగకున్నె? "ఇది నాది. ఈ హక్కులు నాయవి. వీని నెవరు నుల్లఘించి రాగూడదు" అను నాత్మాభిమానము లేనివారికి గరువతనము గాంభీర్యము నగోచరములు. ఈ ధర్మక్షేత్రములో తుదకు మనశరీరములైన మనవిగా జూచుకొనుటయు సఘటితంబుగ నున్నది. ఇట్టివారికి పోడిమి సాహసమును దీపింప జాలునా? కావుననే సన్యాసివేషము ప్రశస్తమని పేరుగనియె. ఈ రీతుల నవులం ద్రోచిన నహంకారము పుట్టునుగదాయని కొందఱాక్షేపింపవచ్చును. నిజమే. అహంకారమున్న నెవరికేమినష్టము? అహంకారము(అనగా గర్వం గాదు, నేను, నాపనులు, నాదేశము, అను బుద్ధి) లేమి మృగప్రాయతయేకదా! అహంకారములేనివారు స్వర్గస్థులగుదురన్న పశుపక్షి మృగాదులుసైతము తప్పక స్వర్గము బొందవలసి వచ్చుగదా! మనం నరత్వచ్యుతులమై కిన్నరులమో యశ్వశీర్షులమై గంధర్వులమో కావలసివచ్చును. అట్టి గతికైన నరకముమేలు. అహంకారము, స్వపర బుద్ధి, యివి తమంతట హానిదములుగావు. సమూహమునకు బ్రతికూలించిన నౌను. అనుకూలించినవైనచో పౌరుష ప్రధానంబులు గాన నమేయ శోభావహంబులవును. నిరహంకారులగు సన్యాసుల కుండునంత యహంకారము సంసారుల కెన్నటికినుండదు. చూడుడు! సన్న్యాసియొక్క మతమేమి? "ఎవరే కడగండ్ల గాంచిన నాకేమి? నేమాత్రము దివ్యపదవియందున్న జాలును" అని చింతించుటగదా! దీనికి నెనయైన యహంభావము త్రిలోకముల గాలించిచూచినను దొరకదు. అది యట్లుండె, దిగంబరత మేలనుటచే దిక్కులేమి సంభవించె. ఇక నిరహంకారత్వమట! నిర్మోహత్వమట! నిత్య దౌర్భాగ్య మనుటకు ఇవి వేదాంతుల తర్జుమా కాబోలు!