పుట:Bhaarata arthashaastramu (1958).pdf/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పదార్థమ లుగావనియు, ఉపయోజ్యములుగావనియు, విధించుకొని, "గోరుచుట్టుమీద రోకటిపోటు" అన్నట్లుఉన్న ప్రాతయిక్కట్టులు చాలవని క్రొత్తవికొన్ని కల్పించుకొని, భగవత్సంకల్పము నిట్టేయని, తమమతమంతయును దాకుట, చూచుట, తినుట, వీనింగూర్చిన వ్యవహారము క్రిందికి దింపిరి. ఈ న్యాయములకు సాక్షులు మనయిండ్లే. నేటికిని పల్లెటూళ్ళలో దీపమువత్తులుచేయుట , సెనగకాయలు, ఇప్పకాయలు, వేపకాయలు, వీనిని ఒలుచుట, వడ్లుదంచుట, రాగులు, నువ్వులు, కందులు, పెసలు ఇత్యాదులను విసరుట, ధాన్యముల నెండబోయుట, వడియములు అప్పడములు పెట్టుట, పొళ్ళుదంచుట. దంచిన వానిని నూరుట ఇత్యాది కృత్యము లనేకములు ఆ యా యింటివారు తమకు దామే చేసికొనుట సుప్రసిద్ధము. ఇంగ్లీషువారికిది యాశ్చర్యకరంబు. "ఈ హిందువులు నివసించునవి కర్మశాలలా యిండ్లా!" యని యబ్బురపడుదురు. మఱియు పశువులనుగూడ ననేకులు గృహములలోనే కట్టుదురుగాన కొట్టములాయని సందేహించినను దప్పులేదు!

ఐరోపియనుల గృహజీవితము

ఇక నిట్లే యాంగ్లేయుల గృహజీవితముల దిలకింపుడు! వారిలో నిఱుపేదలుగ నున్నంగాని జీవనార్థమైన కర్మల నింటిలో జేయరు. జీవనోపాయముల జెల్లించుటకు అంగళ్ళు కర్మశాలలు కచ్చేరీలు నుండగా బవలంతయు నచట బనిసేసి యలసి సొలసి ఇల్లుజేరినతఱి పనిపాటులమఱచి హాయిగ గొంతసేపయిన భార్యాపుత్రులతో సల్లాపముచేయుచు నందఱుగలసి ముచ్చటగా భోజనాదుల దీర్చి విశ్రాంతి ననుభవింప గృహము లేర్పడినవిగాని, రేయింబవలును క్లేశభాజనములైన శ్రమల మెడగట్టికొని మెలంగుటకుగాదని వారి దృఢమైన యభిప్రాయము. అవశ్యక క్రియలలో నొక వంటపనిదప్ప మఱేమియు నింటనుండ నియ్యరు. వంటపని యనగా వంటపనియేకాని యందులకువలయు సంబారములం దయారుచేయుట గాదు. సంబార