పుట:Bhaarata arthashaastramu (1958).pdf/269

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారత అర్థశాస్త్రము

రెండవ భాగము

మొదటి ప్రకరణము

వృత్తుల పరిణామము - గ్రామ్యపద్ధతి

పూర్వమున రాకపోకలు రక్షణమును లేనికాలములో దేశము ఖండ ఖండములుగా తెగినదై, సహజముగ నొండొంటితో నెక్కువ సంబంధములేని గ్రామములుగ విభక్తమయ్యెను. పేరునకు దేశమొక్కటిగ నున్నను నిక్కమునకు బెక్కుతునకలై యుండెను. గ్రామస్థులు త్రిశంకుస్వర్గములోని వారియట్లు ప్రత్యేకించి తమకు వలయువానినెల్ల దామే సేకరించుకొనుచు, మిగిలినదాని నమ్ముటకును, లోపించిన దాని గొనుటకును నవకాశములేనందున సాధ్యమైనంతవఱకు ప్రతిగ్రామమును సర్వవస్తు సమృద్ధముగా నుండునట్లు నిర్మించుకొని, తామొకరినిజూడక, యొకరికి దామగపడక, యంత:పుర కాంతలట్లు తమతమ నెలవులనె కాలుగదల్పక తరతరములుగ నుండినందున, నూతనసంగతుల స్పర్శయైన లేనివారై, నానాటికి జ్ఞానహీనులును సాహసదూరులునైరి. ఏకమార్గమున బోవువారికి నుత్తమ మధ్యమాధమ నిర్ణయశక్తి పూజ్యము. పలుతెఱవుల జాడలెఱింగినంగాని తారతమ్య నిరూపణ మవశ్యకముగదా! విమర్శనజ్ఞానమన్ననో మొదలే సున్న. విమర్శనములేనిది వివేకోదయముండదు. అట్టివివేకహీనులు మూఢులై "తాబట్టి కుందేటికి మూడేకాళ్ళు" అన్నట్లు తమ యాచారములు, వాడుకలు, మతములు, వేషములును ఎంత కష్ట నష్టాపాదకములై రోతను విసుగును బుట్టించునవి యైనను, తదితర సుఖకర మార్గము లున్నవియనియైన దెలియరుగాన, వీనికిం మించిన వేవియులేవని వృథా యహంభావముబొంది, వృద్ధినొందక యధోగతి పాలగుదురు.