పుట:Bhaarata arthashaastramu (1958).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. తూలుచు దూగుచు బదిగంటలు చేయుటకైన దీవ్రముగ నైదుగంటలుచేసిన ఫల మధికమగును. పున:ప్రవేశమునకు శిల్పులును వాడిచెడరు. మనదేశములోన నేకాగ్రములును, దీక్ష్ణములునువగు నుద్యోగములు పూర్వమెపుడో మనపెద్దలుచేసిరని వదంతిగల తపస్సులందేగాని, ప్రకృతము ప్రత్యహములగు కార్యము లన్నింటను అప్రయుక్తములో అల్పప్రయుక్తములో యనునట్లున్నవి. కాలముంబట్టిచూచిన బాశ్చాత్త్యులకన్న మనకు కర్మము మిక్కిలి ఎక్కువ. దేహమనోదార్ఢ్యంబులు శిధిలములైన వారగుటంజేసి సమర్థతం బట్టిచూచిన మిక్కిలి తక్కువ. పనులకుం బూనువేళల వేదాంతము స్మరించుచు నివియెల్ల మిధ్యలు మాయలు అని గొణుగుకొనుచు నిదురించుటయు, నిక నాధ్యాత్మిక తత్వములకుం దొడంగితిమన్ననో "లోకవాసన యెంత రమ్యము: యెంత యాహ్లాదకరము:" అని యింద్రియముల ప్రచారములను స్మరించి మెచ్చుకొని గ్రుక్కిళ్ళు మ్రింగుచు, వేదాంతమునకు మించిన వేదాంతాంతమును జెందుటయు; ఇట్లు రెంటికింగాని నిర్వ్యాపారత్వమను పురుషగుణంబు నుద్ధరించుటయే మనజనుల ముఖ్య సంప్రదాయము. కావుననే ఇహమునకు దూరస్థులమయ్యు బరమునకు సమీపస్థులుగాక యుభయభ్రష్టులమై యుప్పర సన్యాసము దీసికొనియుండుట:


భారత అర్థ శాస్త్రము మొదటి భాగము సంపూర్ణము

__________ ♦ __________