పుట:Bhaarata arthashaastramu (1958).pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవ్వుట తలపోయ హాస్యముగనుంటయేకాదు. "తమదోషముల నెఱుగజాలని మూఢులుగనున్నారు; వీరికి నెన్నడు మంచిగుణము లలవడును" అని చింతయు గలుగకపోదు.

ఈ దేశములో నతిబాల్యశ్రమను సక్రమముగ జేయుటకై చేయబడిన యేర్పాటులు ముందు ప్రకటింపబడియుండు ఆవేశన నిబంధనలో గననగు.

పసివారు నిరంతర శ్రమాన్వితులు గాకుండిన నేమినష్టము? పెద్దలు పూనికతో పాటుపడకుండుటయే మన దౌర్భాగ్యమునకు నాది సదనము. సరాసరికి వారములో నైదునాళ్ళైన పూర్ణముగ గష్టపడరు. ఇంకను గొసరిని తిథివారనక్షత్రములను మిధ్యావాదము లాధారముగ దలచినప్పుడు అంతర్థాన మౌదురు. మనలో మతవిషయక ద్వేషము లమేయములయ్యును పండుగలని పనివీడి నిలిచి పోవుటలోమాత్రము అందఱికి నైకమత్యము చక్కగ బ్రబలియున్నది. అల్లా నీళ్ళలో బడునాడని తిరుమలాచార్యులును శివవిష్ణులు వేట బోయెదరని అగ్బరుఖానును నిష్కర్ములై వాలాయముగ గాలక్షేపముం జేయుటలో అన్యోన్యమైత్రి నెరపుదురు. తదితరదేవసేవనమ్మున నేకీభవింపని వారమయ్యు సోమరితనము నుపాసించుటలో నెల్లరు నొక్కటిగనుంటజూడ నిద్రాదేవికి మించిన దైవత మీదిక్కున లేనట్లు తోచెడిని.