పుట:Bhaarata arthashaastramu (1958).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వఱకు చెందునో విశదపఱచును. వినిమయకాండము సంపత్తును ఒకరినుండి ఒకరికి మార్చునట్టి సాధనములను గుఱించి బోధించును. ఉపభోగకాండము సంపత్తు అదే అర్థము ఎట్లు వినియోగపడునో తెలియజేయును.

అర్థము

అర్థమునకు కొన్నిగుణములుకలవు. ఉపయోగకరములును, పరిమితములును, మార్చుకొనబడ గలవియునగు వస్తువులు అర్థము. ఉ. భోజనపదార్థములు, ఇండ్లు, బండ్లు, వస్త్రములు మొ. ఈ గుణములలో ఏదిలేకున్నను అది అర్థముకాదు. ఉ. గాలి పరిమితము కానందువల్లను, ధూళి ఉపయోగము కానందువల్లను బుద్ధి మార్చుకొనుటకు రానందువల్లను అర్థములుకావు.

అర్థమును ఉత్పత్తి చేసికొనుట అనగా మనుష్యునికి కావలసిన సామగ్రులను చేయుట. అతని ఆశ లనంతములు. కావున చేయబడవలసిన సామగ్రుల సంఖ్యయు అనంతము.

శ్రమ విభాగము

ఒక్కడే కొరముట్లు చేసికొనుటయు, బావి త్రవ్వుకొనుటయు, సాగు చేసికొనుటయు, వస్త్రములు నేసికొనుటయు, ఇల్లు గట్టుకొనుటయు పొసగదు. ఒక్కొక్క డొక్కొక్క సామగ్రిని అది పూర్తిచేయలేకున్న అందులో నొక భాగమునుచేసి అది కావలసిన వారనేకులకు దాని నందించి వారినుండి తనకు గావలసిన ఇతర సామగ్రులను సంపాదించుచున్నాడు ఇట్లు శ్రమవిభాగము ఏర్పడుచున్నది శ్రమవిభాగమువలన అభ్యాస మెక్కుడయి చాతుర్యాభివృద్ధియగుచున్నది. ఒక పనినుండి మఱియొక పనికి ఒకడే కర్మకరుడు మారవలసినపని లేనందున కాలనష్టమును కష్టనష్టమును దక్కుటయేగాక పనులు సత్వరముగను నగును. శ్రమవిభాగము కాను కాను ఇప్పటి పాశ్చాత్య కర్మశాలలయందువలె ఒక్కవస్తువు తయారగుట యనిన వేనవేలు కోటానుకోటులు తయారగుట యగును. ఇంతేకాక శ్రమవిభాగముచే ఎవరిశక్తికి తగినపని వారికి అలవడి సంఘీభావము కుదురుచున్నది.

అర్థశాస్త్రమునపాత్రలు

ఈ శ్రమవిభాగమువలననే సంఘమును ఇటీవలి అర్థశాస్త్రమును ఏర్పడినవని చెప్పవచ్చును. ఒక గుండుసూది మొనను తన జీవితకాలమంతయు తట్టివిడుచుచుండు కర్మకరుడును. ఇట్టి కర్మకరులను పదివేలమందినిచేర్చి పని తీసికొని లాభము సంపాదించుచుండు కర్తయు, పని జరుగుచుండునపుడు ఇందఱను పోషించుటకు ఇతనికి కావలసిన మూలధనమును సేకరించి పెట్టుకొనియుండు సాహుకారియు అధవా బ్యాంకులును, అందఱకును అన్నముపెట్టు ప్రకృతి శక్తులును అనగా భూమి మున్నగునవియును, సామగ్రుల నిక్కడనుండి యక్కడికి మార్చుచు కావలసినవారికి కావలసినవి అందజేయు వర్తకులును, వ్యాపార సంఘములును, భూమిని ప్రజలను ఒక్కటిగజేర్చి కలహము లేకుండదీర్చి వీరిలో వ్యవహారములకు వలసిన వినిమయ సాధనమగు అనగా సామగ్రులను