పుట:Bhaarata arthashaastramu (1958).pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కచ్చేరీలు, రైలుబండ్లు మొదలగు రాజరచితస్థానములయందు నందఱికిని బ్రవేశము సమమని గవర్నమెంటువారు చాటించియున్నారు. అప్పటము ఆర్యులకాలములో సంఘాచారములైన వర్ణాదులును రాజశాసనములతో నేకీభవించి యుండినవి. దానివలనగలిగిన గోడును వర్ణింపనలవిగాదు. ఇపుడు సంఘములో నెంతదిక్కులేనివాడైనను రాజ్యాంగవిషయములయందైన తలయెత్తుకొని తానును మనుజులలో మనుజుడుగా దిరుగవచ్చునను ధైర్యముగలవాడై యున్నాడు. శ్రీరామాదుల కాలములో సంఘములో దిక్కులేని వానికెక్కడను దిక్కులేదు. సంఘములో నగ్రగణ్యుడైన వానికిమాత్రము రాజ్యాంగములలోను పదవి, దొరతనమును లభ్యములు. జనబాహుళ్యమునకు బన్నులుగట్టుటదప్ప మఱేమర్యాదయుం గానము. వేయేల? అభివృద్ధి నాసించి పాటుపడుటయు నింద్యము! ఒకరికొక కీడునుజేయక మోక్షార్థియై తపంబునకుబూనిన శూద్రునకు శ్రీరామచంద్రులు శిరచ్ఛేదనముంజేసి కృతార్థులై ప్రపంచము ధర్మచ్యుతముగాక నిలిపిరట! మనపెద్దల యోగ్యత యీమాత్రము.

దీనిచే నార్థికక్రియలకు నిరోధ ముప్పతిల్లె. ఎట్లనిన:-

అన్యాయముగ నవనీశులు దోచుకొందురను భయమున జేర్చిపెట్ట నెవ్వరు నుత్సహింపరైరి. చేర్చుటయే లేకున్న వృద్ధికై పున:ప్రయోగముంజేయుట యంతకుముందే నహి వితరణబుద్ధి వెడలిపోయె. అథవా యెన్నడైన శుక్రదశవీచి అధిక ధనప్రాప్తి నందజేసిన వ్రతము, వివాహము, పండుగ అను మిషనొకటిబెట్టి త్వరలో భోజనాలంకారాదుల వ్రయమొనర్చి నిర్వ్యాకులులై యుండుట ప్రాజ్ఞలక్షణమని గణింపబడియె. ఎట్లును నష్టము నిక్కంబుగాన దానమైన నొనర్చి స్వతంత్రవ్రయ తృప్తింబొందుదమని పాత్రాపాత్రవిచారణలేక వినియోగముంజేయు వాడుకలలవడె. దానకర్ణతకు దుశ్శాసనములు ప్రోత్సాహకరములైన సఖులు. ఈదేశములో నీగియెక్కుడని కొందఱు