పుట:Bhaarata arthashaastramu (1958).pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బానిసలంజేసి కొంతవడికి స్వాతంత్ర్యమిచ్చినను ఇది నవీన నాగరికతయని దానిపొంతంబోరు. దీనికి దృష్టాంతములు. పూర్వము ఘోర హింసచే మాలలను బశువులకన్న నికృష్టస్థితి నుండజేసిరి. నేడు గవర్నమెంటువారు వారిజూచి ఇకముందు మిమ్ముల నెవ్వడువున బాధపెట్టనియ్యము. స్వేచ్ఛగా నుండుడు. అని బతిమాలుకొన్నను ఉత్తమవర్ణజులం జూచిన "వారికి మానీడగాలి సోకకుండునట్లు తొలగి నడుచుటయే ధర్మము. లేకున్న మోక్షమురాదు" అని నీచత్వ విమోచనంబును అరటిపండువలె నొలిచి చేతులలోనిడినను చేదని పాఱవేతురు. మనస్త్రీలును అట్లే మోటుకాలమునాటి లోకువతనము పతివ్రతాధర్మమనిభావించి యేసొంతములేని దాసీజనంబులట్లు పరమ సమ్మోదముతోనున్నారు. ఎంతకంపైనను ప్రాంతయైనచో మనవారికి అత్తరుపన్నీరులవలె నలరును గాబోలు! ఈ చందంబుననే జనులనేకులు పుస్తకములు బ్రాహ్మణులసొత్తని భ్రమించి వానిపొంతకుం బోయిన గురుద్రోహమని విద్దెనొల్లకున్నారు. దీనతయే దివ్యధర్మం బనువారి దేర్ప నెవరితరము?

ప్రజ్ఞచే వచ్చులాభములు:- చుఱుకుగలవారు పనులం ద్వరలో నేర్చుకొని ప్రవీణులౌదురు. అందుచే గాలవ్యయము తఱుగును. అట్టి వారికి బైవిచారణకర్త లక్కరలేదుగాన కూలిసెలవు మిగులును. వస్తువుల వృధాపాడుచేయక యిచ్చిన సామగ్రితో నెంతవరకు రచింపవచ్చునో యంత రచింతురు. మందబుద్ధులు తక్కువజీతమునకు వచ్చినను సామగ్రిం బాడుసేసి యెక్కువ నష్టముం దెత్తురు. మఱియు యంత్రకళలలో కాయపుష్టికన్న మనశ్శక్తి యెక్కుడనుట పూర్వావేదితము. ఇంకను ఒకగుణము. ప్రజ్ఞానిధులుగానివారు జలచరములట్ల వృత్తియెండినచో నచ్చటనే నిలిచియు మురియుదురు. ప్రజ్ఞానిధులు పక్షులట్లు సమృద్ధియుండు వ్యవహారముల కెగయుదురు. అనగా వారికి వృత్తులుమార్చుట సుగమము.