పుట:Bhaarata arthashaastramu (1958).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీపురుషులకు స్వయంవరములేనిది ఈ దేశమునకు దిక్కు గతియు నేనాటికినిలేక నిత్యవైధవ్యము నొందియుండుననుట. నిష్కర్ష స్వయంవరమనగా దామైకోరుకొనుట. అనగా దమకు హితులని తోచువారల నేర్పఱిచి సఖ్యముజేయుట. కావున గాంధర్వ వివాహము నిషేధింపబడని దేశములో మేలైన రకములు గూడుటచే జాతికి వృద్ధియు గుటుంబమునకు బరమోల్లాసంబును ఉండును. ఉల్లాస ముత్సాహమునకు బుట్టినిల్లు. ఉల్లాసహీను లుత్సాహహీనులుగానుండుట యేమి యాశ్చర్యము? సంసారము దు:ఖసాగరమని యిక్కడ బ్రసిద్ధి. ఇక స్వతంత్రతనియ్యక ముక్కుపట్టుకొనియైన నసహ్యమైన పెండిలి చేసికోవలసినదని నిర్బంధపెట్టింప నాసంసారము దు:ఖసాగరముగాక ఆనందవార్థిగానుండునా? సంసారమును బంధన మందురు. బంధనమననేమి? పారతంత్ర్యవర్తనము. కావున నీదేశములో నది బంధనమే. అంతేగాదు. పశువులను ఎనుములను గుమిగా దోలు బందెదొడ్డివంటిదని చెప్పినను నెక్కువగాదు. ఇదంతయుంజూడ సన్యాసమే యిహపరసాధనము అనుటలో నేదో కొంతగుణమున్నట్లు తోపకమానదు. పరమును సాధింపకపోయినంబోయె. ఈదౌర్భాగ్యపు ఇహమునుండి తప్పించుకొనుటయే మోక్షమను పురుషార్థముకాబోలు!

ఈ యనాచారములు ప్రబలియుండగా సంఘసంస్కార పారాయణులు (అనగా సంఘసంస్కారమును గుఱించి యుపన్యాసముదప్ప మఱేమియు జేయనివారు) కన్యాశుల్కము వరశుల్కము బుచ్చుకొనుట గూడదని యేకవాక్యముగా ననేకకంఠములతో గుయ్యిడెదరు. నాకుం జూడమోహమున్న ద్రవ్యాపేక్ష యేరికిని ఉండదు. మోహములేనివాడు పెండ్లియేల? ఇక మోహమునకుంగాకున్న ధనమునకైన నుండవలయుగాని నిష్కారణముగా నిచ్చలేని పిచ్చిపెండ్లి కెవడైన సమ్మతించునా? అట్లైన మోహనష్టమునకై ధనముగొని యింకొక్కెడ మోహపూర్తికైపెట్టనెంచుట యస్వాభావికమా!