పుట:Bhaarata arthashaastramu (1958).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాదు. రెండవది. కాలికి దెబ్బతగిలినను ఇతరావయవములును నవయుమాడ్కి సంఘములో నొకతెగవారి యనుచిత కర్మములవలన నెల్లరకును గీడుమూడుట సహజము. మూడవది. తలిదండ్రులనుండి పడయబడిన దేహమిది. వారిసొత్తులతోగూడ వారి గుణదోషములకును భాగస్థులగుటలో నేమి యవలక్షణమున్నది? మనపూర్వులు గావుననే వారును మనము నేకమని చెప్పవచ్చును. పురుషుడు భార్యయందు బుత్రరూపమున నవతరించుననెడు మనపూర్వపు బెద్దల వాక్యము వినలేదా? కావున తరతరములవారి యైక్యము సంఘము శరీరమనియు ప్రజ లందులోని యవయవములనియు నిరూపించుటకు బ్రశస్తమైన సాక్ష్యము.

కార్యములచే గర్తకుదప్ప నింకెవరికి నేమియు సంభవింపని పక్షమున నెవరెట్లుజేసిన నేమియని యశ్రద్ధగానుండినం దప్పులేదు. కార్యములు మనతో నంతమొందునవిగావు. మఱి యితరులను ఇక ముందురాబోవు తరములవారిని బట్టునవిగాన దేశసంఘమునకు బ్రతికూలములైన యాచారముల బరిత్యజించుటయే పరమధర్మము. ఒక్కసంతతివారికేగాదు. పూర్వులకును సంఘము ఏకమను న్యాయముం బట్టి మనచే హీనతగల్గును. ఎట్లన, మనము ఏవపుగతికివచ్చిన, "పెద్దలలో దోషములేనిది వీరికిట్టి దుస్థితివచ్చునా" యని యందఱు వారిం గూడ నిందింతురు. కావున భూతభవిష్యద్వర్తమానములను అన్యముగాని మూర్తితో స్థిరముగానుండు దేశసంఘమునకు గౌరవా భ్యుదయముల గలిగించుటయే నిజమైన పితృతర్పణము. ఇతరములు నూగుల నీళ్ళ చేటుమాత్రమేగాక పితృఘాతుకములును.

హిందూజాతియొక్క క్షీణతకు గారణములు

ఎవ రెన్నివిధముల వాదించినను హిందూజాతి కొంతవఱకును క్షీణదశకువచ్చినదనుట యొప్పుకోవలసిన విషయమే. దీనికేమి కారణము అనుట చింతనీయము. అందు గొన్నిమాత్ర మిటసూచింతము:-