పుట:Bhaarata arthashaastramu (1958).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. ఇతరులనియంటిరే ఇతరులెవ్వరు? నీసంతతికి సంఘమునకుం జేరినవారిని పెరవారని యనునంత ఱోతబుద్ధి యెవరికైన నుండునా?

3. నీచులు తమమేలునాసించియ మేలుచేయుదురు. ఇది కూలికైచేయు ధర్మమువంటిది. మహాత్ములత్రోవవేఱు. తమప్రయోజనమునే సమకూర్చునదియైన "ఈ చిల్లర మానిసియైన నాకొఱకు పాటుపడవలయునా" యని ధర్మమునైన సైరింపరు. "నేనొక్కడు తేలిననేమి మునిగిననేమి" యని యుపేక్షజేతురు. తమకార్యముచే నితరుల కెగ్గో లగ్గో యగునేని అప్పుడు తమచే నితరుల కేయుపాధి తటస్థించునో; లేక, ప్రాప్యహితమ్ములు ప్రాప్తింపకపోవునో యని మెలకువతో వర్తింతురు. సమూహ శ్రేయంబునకు గారణమగుటం జేసియే ధర్మాచరణంబు కర్తవ్యంబయ్యె.

4. ఆత్మపక్షమగు తత్తరపాటేగాని ప్రజాచింతలేనివారమగుటం గాదె మనదేశమునకును మనకును భంగము దెచ్చుకొంటిమి.

5. స్వప్రయోజనపరత పాతకంబగుటయకాదు. కుంఠితమనియు వ్యర్థమనియు పూర్వమే బోధించితిమి.

ధర్మమునకు నాశ్రయము సంఘము

ధర్మము సమూహపరంబు. సమూహములు వివిధంబులును విరుద్ధములునుగాన ధర్మంబులు నట్లే భిన్నంబులై పఱగు. దృష్టాంతం: సమూహములకు కుటుంబము, కులము, జాతి, వర్ణము, సంఘము లేక దేశము. నిదర్శనములు: హనుమయ్య శాస్త్రి యిల్లు; ముఱికినాడు స్మార్తులు; బ్రాహ్మణవర్ణము; హిందూజాతి; భారతసంఘము; భారతీయులలో ప్రకృతము ఆర్యులేకాక అనార్యులగు తురుష్కులు పారసీకులు మొదలగు జాతివారును జేరియున్నారు. సమూహములు స్థానము ననుసరించియు నేర్పడును. ఉదాహరణము; తాలూకా, జిల్లా, దేశము, ఖండము ఇత్యాదులు.