పుట:Bhaarata arthashaastramu (1958).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశేషించిన విత్తములచే మాదేశములోని వృత్తులు వీర్యవంతము లౌననుట యేమినిజము? చంచలమైన పరిపణముతో ప్రపంచాటనము జేయ మేము హనుమంతులముగాము నారదులముగాము! ఒకవేళ చీనా, ఇండియా, అమెరికాలోని ప్రజలకు బత్యము సత్యమైనను ఇంగ్లాండులో యంత్రములచే గతజీవనులై వగలనొగులు మాకు నందుచే నాకలి యంత మొందునా? కావున యంత్రములు సర్వశ్రేయ:ప్రదములనుట పుంజిగలవా రనవలసినమాటగాని కర్మకరులు వచింపదగిన వాక్కుగాదు. సాహుకారులకు సుఖమే. మాకు దత్కాలమునందైన దు:ఖమే! ఉత్తరకాలమున సుఖమున్నను కాచివేచి యుండుటకు సొత్తులేనివారమగుట మాకు సాధ్యముగాదు. "దీని గడచి దీర్ఘాయుష్మంతుల మైనగదా పెన్నదాటి పెరుమాళ్ళసేవ జేయుట?"

ఈ చర్చచే స్ఫుటములగు విషయములు

1. పుంజిగలవారు కర్మకరులును గొన్నివిధముల మిత్రులును గొన్నివిధముల శత్రువులును గానున్నారు. దీనివివరము.

శ్రమ సహాయకాదిగానిది మూలధనము నిష్ప్రయోజనము. ఒకసంచిలో సవరనులు భద్రముగా దాచియుంచిన నవి కోళ్ళరీతిని తమంతట గ్రుడ్లుబెట్టి పిల్ల నాణెముల మనకియ్యవు. మూలధనము వృద్ధికి వచ్చుననగా పాటునకు దోడుపాటైన ననియర్థము. సముత్థానపరులు వ్యవహారముల విక్షేపించినంగాని పుంజిగండనకురాదు. శ్రమయు బరిపణములేనిచో కుడిభుజము లేనిదట్లగును.

ఇక శత్రుత్వ మెట్లనిన:- కూడినవఱలో చేతిపనికి బదులు యంత్రపుబనిని ప్రవేశ పెట్టవలయునని పుంజిగలవారి యుద్దేశము. ఏలనగా, యంత్రములు "ఆలస్యముగావచ్చుట, ఆటవిడుపుగోరుట, పెద్దలకు దర్పణము విడుచుటకై రజాకావలయుననుట. చెప్పి రాకపోవుట, వచ్చి చెప్పకపోవుట, ఎక్కువ సంబళము గావలయుననుట,