పుట:Bhaarata arthashaastramu (1958).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లనుట నిరూపింపవచ్చును. అదెట్లన; యంత్రోత్పాదితముల వెల తగ్గును. దానివలన బీదలుగాకున్నను ధనికులైననను ఈప్సితవస్తుసంపాద నంబున మునుపటికన్న తక్కువవ్రయము జేయుదురు. తక్కువ వ్రయముచే నెక్కువగ మిగులబెట్టగలరు. ఇట్లు మిగిలిన విత్తంబులు మూలధనంబులుగ నూతనోత్పత్తికై యుద్యమములం దొడంగుదురు. అందుచే వృత్తులు వర్ధిల్లు తొల్లి యంత్రకలాపోదయమ్మువలన స్థానభ్రష్టులైన కర్మకరులకు మఱల జీవనోపాయముల సమకూర్చును. యంత్రములు శ్రమను మిగుల్చుటయేకాక మూలధనమునుమిగిల్చి మూరుకొనజేయు గావునను, ఈ మిగిలింపబడిన రెండును కలసినం గాని వ్యర్థములగుగాన, పరస్పరాకర్షణశక్తియుతము లగుటంజేసియు చిట్టచివరకు దప్పక సంగమించి నిరవధిక ధనరాసులకు జన్మభూములై భాగ్యవంతులకును నిర్భాగ్యులకును సమానముగ సౌఖ్యము లొడగూర్చును. కావున యంత్రములును హస్తములును ఇతరేతర ద్రోహులు గావు. అన్యోన్యసహాయకారులే.

పై వాదమునకు ఆక్షేపణలు:-

చిట్టచివరకుగలిసి సుఖించుట యట్లుండనిండు. చిట్టచివర యనగా కాలాంతరమున ననుట. ఈ కాలము స్వల్పమో దీర్ఘమో ఎవరెఱుంగుదురు? క్రొత్తవృత్తుల నతిశీఘ్రముగ నలవరించుట యసంభవము. ఈ మధ్యములో కడుపాత్రము నెట్లు భరింపనేర్తుము?

మఱియు గూలివారమైన మేము బిడ్డపాపలుగల సంసారులము గావున తావుమార్చుట బహుదుర్లభము. తావుమార్చుటయే దుర్లభమనగా నిక దేశదేశముల ద్రిమ్మరుటయన కలనైన నసంభావ్యము. మూలధనమో మాయట్లు స్థావరముగాదు. ఱెక్కలుగల పక్షవంటిది. ఇంగ్లాండులో మిగులబెట్టబడిన వసువులు ఇండియారైల్వేలలోను చీనాదేశపు రైల్వేలలోను, దక్షిణ అమెరికాయందలి గోధుమపంటల యందును విక్షిప్తములైయుండుట సర్వజన విదితమేగదా! కావున