పుట:Bhaarata arthashaastramu (1958).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలగువానిలో వేయబడియుండు ప్రతిమలు తొలుత హస్తలిఖితములుగాని యంత్రలిఖితములుగావు. నేతపనికిని, నేసినవానిపై ముద్రింపబడు ప్రతిమలపనికిని ఇదియొక్క తారతమ్యము. నేతపని యాద్యంతము యంత్రకృతము. ప్రతిమలన్ననో చిత్రించుట, చేతిపని. ముద్రించుటమాత్రము యంత్రకల్పితము.

ముద్రించుటయననేమి? ఒకపలకలో అక్షరములో రంగులో యొకతీరునజేర్చి కూర్చితిమేని ఆపలక కాగితము, వస్త్రము, ఇటువంటి వస్తువులపై నొకదానివెనుక నొకటిగా పదేపదేపడుట. కాగితము నొకయంత్ర మొకజాడగా బ్రక్కకు లాగుచుండును. అది యొక నిముసమో రెండునిముసములో సాగుచుండిన పిదప పలకను ఇమిడ్చియుండుభాగములేచి తనముందువచ్చిన కాగితపుభాగముపైబడి మఱల వెనుకకుబోవును. కాగితము మునుపటియట్లు అవతలికిబోవుచుండును. మరల రెండునిముసములకో నియమితమైన యెంతకాలమునకో పలక యధారీతినిపడి వెనుకకు మఱలును. ముద్రాపణమన నింతయే. యంత్రములు నియమప్రకారము ఏకవిధమైన గమనమును గుణీకరించునేగాని చిత్రకారుడు వన్నెలు, గీతలు, పొందికపొసగజేర్చునట్లు నానావిధగతుల సమన్వయింపజాలవు. ఇంతేకాదు. చిత్రమనగా భావప్రదర్శనమైన కృత్యము. చిత్రకారుడు, కవి, గాయకుడు వీరలు స్త్రీపురుషుల హృదయములోని భావములను, రసములను, ఇంగితములను ప్రకటించునట్టియు, నుద్దీపింపజేయునట్టియు క్రియలను సృష్టింతురు. జడపదార్థములైన యంత్రములకు భావము లెక్కడివి? కాళిదాసునివలె కవిత్వం జెప్పుమా యని యెంత బొగ్గు నీళ్ళువేసినను ఆవిరిమ్రోతదక్క ఇంకే ధ్వనియు బయటికిరాదు. సౌందర్యము, హాస్యము, కోమలత, ప్రచండత ఇత్యాది రసములు మనుష్యమానసాంతర్గతంబులు. వీనిని వెలిబెట్టు చేష్టలు మనుజసాధ్యములుగాని యన్యంబు లెన్నంటికింగావు.

కావుననే వస్త్రాభరణాదులయందును అద్భుతములైనవి హస్త రచితములుగానుండుట. మిక్కిలి సుకుమారములైనవియు రంగులు,